నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. అనేక చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి.ఈ నేపథ్యంలో లమ్బాథాచ్ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్తున్న ఆ రాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్‌కు మండి ప్రాంతంలో తృటిలో ప్రమాదం తప్పంది. కొండ ప్రాంతం దాటుతుండగా ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడటంతో శిథిలాల మధ్య ఆయన కారు చిక్కుకుపోయింది.
అయితే, ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన జైరామ్ ఠాకూర్ కారు దిగి మరి కొందరితో కలసి సురక్షితంగా ఆ ప్రాంతాన్ని దాటారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం ధార్వాడ్ థత్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యయి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక యంత్రాంగం, డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ బృందాలు స్థానికులను ఖాళీ చేసేందుకు మోహరించినప్పటికీ సహాయక కార్యక్రమాలకు వర్షాలు అంతరాయం కలిగిస్తున్నాయి.