Sunday, October 19, 2025
E-PAPER
Homeసోపతికదలని కలం.. మూగబోయిన గళం..

కదలని కలం.. మూగబోయిన గళం..

- Advertisement -

జుబీన్‌ గార్గ్‌ గళంలో అంతు పట్టని మార్మికత. ఎవరికీ అందని ప్రత్యేకత. ఆ స్వరం తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన మెలోడీ అతని పాటలో ప్రత్యేక లక్షణం. సంగీతం శిశువుల్ని, పశువులనే కాదు, పాములను కూడా పరవశింపజేస్తుందన్నట్లు ఆయన పాట కుర్రకారును ఉర్రూతలూగించింది. జుబీన్‌ గార్గ్‌ స్వర మాధుర్యం అస్సాంలో ఉద్భవించి మానవతా, ఉద్యమ స్ఫూర్తిని ఇముడ్చుకుని ఒక ఝరిలా సరిహద్దులను దాటి ప్రవహించింది.
అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్‌ గార్గ్‌ మరణం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా బాలీవుడ్‌ సంగీత ప్రియులను కూడా విషాదంలో ముంచెత్తింది. జుబీన్‌ గార్గ్‌ అంత్యక్రియలు మైఖేల్‌ జాక్సన్‌, పోప్‌ ఫ్రాన్సిస్‌, రాణి ఎలిజబెత్‌ తరహాలో ప్రపంచంలో 4వ అతిపెద్ద అంత్యక్రియగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో నిలిచింది.
జుబీన్‌ కేవలం గాయకుడిగానే కాకుండా స్వరకర్త, పాటల రచయిత, వాయిద్యకారుడు, నటుడు, దర్శకుడు, చిత్ర నిర్మాత, కవి గా తన బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. శ్రావ్యమైన ఆయన స్వరంలో అపురూపమైన భావోద్వేగాలు పలికి శ్రోతలను మైమరిపించాయి. అస్సాం సంగీత, సాంప్రదాయాలు, జానపద గీతాలు, స్థానిక కథాకథనాలు అతని మీద లోతైన ప్రభావాన్ని చూపాయి. ఆ అనుభవాలు అతని సంగీత కళా నైపుణ్యంతో బలమైన పునాదిగా మారాయి. అస్సామీ ప్రజల వ్యక్తిత్వం మరియు ప్రత్యేక గుర్తింపు అతని సంగీతంలో ప్రతిబింబించాయి. జుబీన్‌ గానం ప్రజల గుండెచప్పుడైంది. అందుకే అతను మిలియన్ల మంది అభిమానుల హదయాలను గెల్చుకోగలిగాడు.
1972లో మేఘాలయలోని తురాలో జన్మించిన జుబీన్‌ గార్గ్‌ సుమారు 40 భాషల్లో 38,000 పైగా పాటలు పాడారు. అంతేకాకుండా ఆయన ప్రజలతో సాన్నిహితాన్ని పెంచుకుని, సామాజిక సమస్యల కోసం పోరాటం చేసి, వారి హదయాలలో చెరగని ముద్ర వేశారు. భూపేన్‌ హజారికా వంటి దిగ్గజాల పాటలకు అలవాటు పడిన అత్యధిక ప్రేక్షకులకు, మొదట అతని గురించి ఎక్కువగా తెలిసేది కాదు. కానీ, క్రమంగా అతని సంగీతం అస్సామీస్‌ సంస్కతిలో కొత్త ధోరణిని సష్టించింది. అతని పాటలు భావోద్వేగం, ప్రణయ, విరహ, శంగార, కరుణామయ, జానపద గీతాలు, వైవిధ్యభరితమైన పాటలతో విమర్శకులను కూడా ఆకట్టుకోగలిగాయి. అతని విలక్షణమైన స్వరం ప్రత్యేకమైన శైలి, సంగీత అభిమానులను ఉర్రూతలూగించింది. అతని పాటలు అస్సాంలో అత్యల్ప సమయంలోనే ప్రాచుర్యం పొంది, సంగీత ప్రయాణానికి నాంది పలికింది.
జుబీన్‌ సంగీత ప్రయాణం ఆయన మూడేళ్ల వయసులోనే ప్రారంభమైంది. తండ్రి కవి, గీత రచయిత కావడం వల్ల, అతనికి పాడటం అలవోకగా అబ్బింది. సంగీతం ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో ఒక పార్శ్వం మాత్రమే. తన మొదటి ఆల్బమ్‌ ”అనామిక” 19 సంవత్సరాల వయస్సులో విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నారు. తన మొట్టమొదటి పాట 1997 లో ”దిల్‌ మేరా చురయా ఏక్‌ హసీనా” తో మొదలుకొని 1999లో గ్యాంగ్‌ స్టర్‌ చిత్రంలో తన హిట్‌ సాంగ్‌ ”యా అలీ” తో బాలీవుడ్‌లో జుబీన్‌ పేరు మారుమోగి, అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. హిందీ, అస్సామీ, బెంగాలీ వంటి భాషల్లో పాడిన జుబీన్‌ విభిన్న భాషల ప్రేక్షకుల హదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగలిగాడు.
ఆయన సజనాత్మక కౌశలాలు కేవలం సంగీతం తోనే పరిమితం కాలేదు. ధోల్‌, డోటారా, మాండొలిన్‌, కీబోర్డ్‌, తబలా, హార్మోనియం, గిటార్‌, డ్రమ్స్‌, హార్మోనికా, వివిధ పెర్కషన్‌ వాయిద్యాలతో సహా 12 కి పైగా సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన తన ప్రతిభను సినిమాల్లోనూ ప్రదర్శించారు. అస్సామీస్‌ చిత్రాలు ‘బహా’ (2009), ‘కన్యాడన్‌’ (2013) వంటి సినిమాల్లో నటించడం ద్వారా, దేశం ఆయనను బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారుడుగా గుర్తించింది. అస్సామీ సంప్రదాయాలు, భాష, జానపద వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, అస్సామీ సంస్కతిని ప్రపంచవ్యాప్తం చేయడంలో, భాష సంస్కతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో జుబీన్‌ గార్గ్‌ ఎనలేని కషి చేశారు. అస్సాంలో విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా నిరుపేద పిల్లలకు విద్య, వైద్యం అందించేందుకు వివిధ దాతత్వ కార్యక్రమాలు చేపడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కషి చేశారు.
ఆస్సాంలోని అనేక యువ కళాకారులకు సంగీత పరిశ్రమలో రాణించడానికి విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు. అస్సామీ సంగీతం వద్ధి చెందేలా నిర్విరామ కషి చేశారు. అంతేకాకుండా కలగురు ఆర్టిస్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరుపేద ప్రజలకు నిధులు,భౌతిక సహాయాన్ని అందించారు. వరదల కారణంగా అస్సాం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినప్పుడు తన ఫౌండేషన్‌ ద్వారా బట్టలు, మందులు, విరాళాలు సేకరించి నిరుపేదల పాలిట దేవుడైనాడు. కోవిడ్‌ సమయంలో ఆసుపత్రులు నిండి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో జుబీన్‌ తన రెండు అంతస్తుల గౌహతి ఇంటిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ గా మార్చడానికి ముందుకొచ్చాడు. సాధారణంగా కళాకారులు ”పాటలకు మాత్రమే పరిమితం. కానీ జుబీన్‌ పాటలకు పరిమితం కాకుండా ప్రజల కోసం పోరాడాడు. అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో రిక్రూట్మెంట్‌ స్క్యామ్‌ తర్వాత, జుబీన్‌ అవినీతి గురించి బహిరంగం చేయడానికి ‘కంచన్‌ జంగ్‌’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా రాజకీయ విమర్శలకు కారణమైనా, అతను వాటికి జంకకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అస్సాంలో పౌరసత్వ (సవరణ) చట్టం నిరసనలు తలెత్తినప్పుడు జుబీన్‌ క్రియాశీలక పాత్ర పోషించి, రాజకీయేతర ఉద్యమ ధీరుడిగా ఎదిగాడు.
భారతదేశ చరిత్రలో ”అన్నాదురై” అంత్యక్రియల ఊరేగింపుకు కనీవినీ ఎరుగని రీతిలో 15 మిలియన్ల మంది హాజరయ్యారు. ఇది దేశంలోనే మొదటి అతిపెద్ద అంత్యక్రియ ఊరేగింపు. గౌహతిలో జుబీన్‌ గార్గ్‌ అంతిమ వీడ్కోలు ప్రపంచంలో 4వ అతిపెద్ద అంత్యక్రియగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో నిలిచింది.

కోట దామోదర్‌, 9391480475

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -