Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeజాతీయంకార్పొరేట్‌ విధానాలపై కన్నెర్ర

కార్పొరేట్‌ విధానాలపై కన్నెర్ర

- Advertisement -

– మోడీ, ట్రంప్‌ దిష్టి బొమ్మలు, సీఈటీఏ కాపీలు దహనం
– దేశవ్యాప్త ఆందోళనలో పాల్గొన్న లక్షలాది మంది రైతులు, కార్మికులు
– రైతుల రెట్టింపు ఆదాయమేది? : ఎస్కేఎం నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ విధానాలు, అమెరికా విధించిన 50 శాతం సుంకాలపై దేశంలోని రైతాంగం, కార్మిక వర్గం కన్నెర్ర చేసింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మలను, ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) కాపీలను దహనం చేశారు. దేశంలోని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం, ఇండియాపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలను వ్యతిరేకిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో ”బహుళ జాతి కంపెనీలు క్విట్‌ ఇండియా – క్విట్‌ కార్పొరేట్‌ వ్యవసాయం”పై ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పది కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు వివిధ సంఘాలు మద్దతునిచ్చి పాల్గొన్నాయి. దేశంలో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఒడిశా, కర్నాటక, త్రిపుర, జార్ఖండ్‌, హర్యానా, బీహార్‌, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఆందోళన జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నప్పటికీ రైతులు, కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఉత్తర ప్రదేశ్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో దిష్టిబొమ్మలను కాల్చకుండా పోలీసులు రైతులను, కార్మికులను అడ్డుకున్నారు. నోయిడాలో జరిగిన ఆందోళనలో ఏఐఎడబ్ల్య్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, ఏఐకేఎస్‌ ఆర్థిక కార్యదర్శి కష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు. మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మలను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతు, కార్మిక నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దేశవ్యాప్త నిరసనలలో పాల్గొన్న రైతులు, కార్మికులకు ఎస్కేఎం అభినందనలు తెలిపింది. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2017లో ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, కానీ వాస్తవానికి ఆయన కార్పొరేట్‌ అనుకూల విధానాలు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేసి వ్యవసాయ దుస్థితిని మరింత తీవ్రతరం చేశాయని ఎస్కేఎం నేతలు విమర్శించారు. గత మూడు కేంద్ర బడ్జెట్‌లలో లాభాదాయక కనీస మద్దతు ధర, సమగ్ర రుణమాఫీ తిరస్కరణ, ఎరువుల సబ్సిడీలో రూ.85,000 కోట్ల కోత, ఉపాధి హామీ కేటాయింపుల్లో తగ్గింపు వంటి రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక నిర్ణయాలు అమలు చేయడం దారుణమన్నారు.

దేశంలో ప్రతిరోజూ 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, గ్రామీణ కుటుంబాలు వలస వెళ్లాల్సి వస్తుందని అన్నారు. పట్టణాల్లో రైతు కుటుంబాలు కష్టకాలంలో వలసలకు గురవుతున్నాయని, తద్వారా కార్మిక వర్గం బేరసారాల శక్తిని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. శ్రామిక ప్రజల హక్కులను కాపాడటానికి, దేశీయ ఆర్థిక వ్యవస్థను శక్తివంతమైన, పోటీతత్వంతో అభివృద్ధి చేయడానికి బదులుగా, మోడీ ప్రభుత్వం దేశంలోని సహజ, మానవ వనరులను దోచుకోవడానికి కార్పొరేట్‌ అనుకూల విధానాలకు కట్టుబడి ఉందని వారు విమర్శించారు. విదేశీ వాణిజ్య ఒప్పదం (ఎఫ్‌టీఏ)పై సంతకం చేయడానికి, భారత ఆర్థిక వ్యవస్థను విదేశాలకు అప్పగించడానికి యూకే, ఈయూలతో సహా అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిడికి మోడీ ప్రభుత్వం లొంగిపోయిందని విమర్శించారు. తద్వారా స్వతంత్ర భారతదేశం సార్వభౌమ శక్తిని ప్రమాదంలో పడేసిందని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి ప్రతీకారం తీర్చుకోవడానికి వెనకడుగు వేశారని విమర్శించారు.

రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, శ్రామిక ప్రజలను అప్పుల నుంచి విముక్తి చేయడం, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయడం, కార్పొరేట్‌ దోపిడీని అంతం చేయడం, తీవ్రమైన నిరుద్యోగాన్ని పరిష్కరించడం వంటి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎస్కేఎం నేతలు డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి కార్పొరేట్‌ అనుకూల విధానాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంటే, కార్మికులు, రైతులు ఐక్యమై దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక, మిలిటెంట్‌ పోరాటాలు నిర్వహించాలని వారు హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad