నవతెలంగాణ-హైదరాబాద్: నవతెలంగాణ దినపత్రిక గ్రంథాలయంలో సుదీర్ఘకాలం సేవలందించిన లైబ్రైరీయన్ సునీత తన విధులకు స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. 2003 నుంచి 2026 వరకు సమర్థవంతంగా తన సేవలందించారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్‌లో యజమాన్యం వీడ్కోలు సమావేశం నిర్వహించింది. మొఫిసల్ ఇంచార్జీ వేణు మాధవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుదీర్ఘ కాలంగా సంస్థకు సేవలందించిన సునీతకు నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్, బుక్ హౌస్ ఎడిటర్ ఆనందచారి, సోపతి ఇంచార్జీ సలీమ, హెచ్ఆర్ జీఎం నరేందర్ రెడ్డిలు ఆమె సేవలను కొనియాడారు. సమర్థవంతంగా, విధుల్లో భాగంగా కష్టానష్టాలను అలవోక అధిగమించి, సంస్థ ఉన్నతికి కృషి చేశారని ప్రశంసించారు. నేటి సమాజంలో మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉండగా.. అంగవైకల్యంతో బాధపడుతున్న తన తమ్ముడి కోసం ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేశారని, మానవత్వ విలువలు ఇంకా ఉన్నాయని సునీత నిర్ణయంతో రూడీ అయిందని అభినందించారు. అదే విధంగా సహచర ఉద్యోగులు వారితో ఉన్న క్షణాలను, వృత్తిలో తను చూపిన ప్రతిభను నెమరువేసుకున్నారు.
నవతెలంగాణ, పార్టీతో తన బందం వీడదీయలేనిదని, తన పట్ల సంస్థ చూపిన ఆధారణ, ఆప్యాయత, గౌరవ మర్యాదలు చిరుస్మరణీయమని లైబ్రరీయన్ సునీత చెప్పారు. ఆ తర్వాత లైబ్రరీయన్ సునీతకు జ్ఞాపికను అందజేసి శాలువతో సన్మానించారు. అలాగే తోటి ఉద్యోగులు ఆమెకు బహుమతులు అందజేశారు. సునీత కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సాధరంగా వీడ్కోలు పలికారు.







