Sunday, August 3, 2025
E-PAPER
Homeసోపతిశృంగారమై పరుగులు తీసిన పాట

శృంగారమై పరుగులు తీసిన పాట

- Advertisement -

వయసుకు కళ్ళెం వేయలేం. మనసునూ ఆపలేం. ఆరాటంతో తహతహలాడే వయసు సముద్రం లాంటిది. చెలియకట్టలు తెంచుకుని వీరవిహారం చేస్తుంది. ఆ ఆరాటమున్న వయసుకు మనసు సహాయం చేస్తుంది. వయసు తడి తగిలి మనసు మరింతగా ఉరకలెత్తుతుంటుంది. వయసు చేసే శృంగారపు పోరాటాన్ని పాటగా రాశాడు భాష్యశ్రీ. 2018 లో సత్యనారాయణ ఏకరి దర్శకత్వంలో వచ్చిన ‘మోని’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.
కోరిక పుట్టాలే గాని వయసు ఏదైతేనేం. మనసు ఆగదు. కోరిక తీర్చుకోవాలనుకుంటుంది. ఒకవేళ లేతవయసైతే కోరికలు అధికంగా ఉంటాయి. నడివయసు, ముదిమి వయసు అయినా కోరికలు ఉంటాయి. కాని తక్కువగా ఉంటాయి. లేతవయసులో ఉన్నవారికి కలిగే కోరికలు ఎలా ఉంటాయో, వారి మనసు ఎలా ఉరకలేస్తుందో శృంగారపు భావాలతో అద్భుతంగా చెప్పాడు భాష్యశ్రీ.
భాష్యశ్రీ గొప్ప భావుకత ఉన్న కవి. ఈ మాట అలవోకగా అన్నది కాదు. ఈ పాట వింటే చాలు.. ఈ మాట ఎవరైనా అంటారు. అంత బాగా రాశాడీపాటను భాష్యశ్రీ. వయసులో ఉన్న ప్రేమికుల జంటకు కలిగిన కోరికలు ఈ పాటలో కనబడుతున్నాయి. వాళ్ళు శృంగారంలో తారాస్థాయికి చేరుకోవాలన్న తపనతో ఉన్నారని ఈ పాట చెబుతుంది.
ఆ ప్రేమికులకు గుండెల్లో ఓ వివాదం మొదలవుతుంది. వివాదమంటే గొడవ అని అర్థం. ఆ గొడవ వయసు చేస్తున్న గొడవ. కోరికలు చేస్తున్న గొడవ.. మనసులోకి వయసు చేరి చేస్తున్న గొడవ అని అర్థం చేసుకోవచ్చు. వయసు వల్ల పుట్టిన కోరికలు మనసులోకి చేరి చేస్తున్న గొడవ అని కూడా అర్థం చేసుకోవచ్చు. గుండెల్లో వివాదం జరుగుతున్నప్పుడు ఆ లేత ప్రాయం (లేత వయసు) గజిబిజిగా ఉంటుంది. పిచ్చిపట్టినట్టుగా ఉంటుంది. ఏం చేయాలో తోచనంత చిందరవందరగా ఉంటుంది. ఇదంతా ఎవరికి జరుగుతుందంటే.. అమ్మాయికి జరుగుతుంది. ఈ పాటలోని భావాలు అమ్మాయి తరపున చెప్పబడుతున్నాయి. కాని కోరికలు ఇద్దరిలో రెక్కవిప్పుకున్నాయని సినిమా సన్నివేశం స్పష్టం చేస్తోంది.

ప్రాయం గజిబిజిగా మారింది. శరీరం అగాథంలా మారిపోయింది. శరీరం అగాథం అనడం లోతైన భావన. ఆమె శరీరం లోయ అయితే ఆ లోయలో అబ్బాయిని దూకమనే సూచన, సైగ ఇక్కడ కనబడుతుంది. గాయం తపనల్లే ఉంది. తపించిపోతూ ఉంది. గాయాలు అంటే.. ఇక్కడ కోరికలు చేసిన గాయాలు.. ఆ అబ్బాయి చేయాల్సిన కొంటె గాయాల కోసం ఇక్కడ ఎదురుచూస్తోందని అర్థం. విరహం ఆమెను ముంచివేస్తోంది.. కోరికల ప్రవాహంలో ఆమె మునుగుతూ ఉంది. తేలుతూ ఉంది. ఆమెనే చంపేసే అంతగా ఎదలో ఏదో కలహం జరుగుతోంది. చంపేసే అంతగా ఆమెలో తపన ఉన్నదని ఇక్కడ తెలుస్తోంది. కౌగిలిని తనకు ఇచ్చి కొంత ఆరాటం తీర్చవా.. ఓ ప్రియా.. నీ దయ చూపించు.. అంటూ ఆ అమ్మాయి తన ప్రియుడిని గోముగా అడుగుతోంది.
ఆమె వయసే చిలిపిది. అబ్బాయిదీ చిలిపి వయసే. అంటే.. కొంటె పనులు చేయడానికి చిరునామాగా నిలిచిన వయసు. ఈ చిలిపి వయసు చాలా ప్రమాదమైనదని కూడా చెబుతోంది. ఎందుకంటే మనల్ని కుదురుగా ఉండనివ్వదు. ప్రశాంతంగా తిననివ్వదు, పడుకోనివ్వదు. మనల్ని కోరికలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. అయినా మత్తైనదీ వయసు. ఈ ప్రమాదమైన చిలిపివయసులో సుఖం చెదిరిపోతోంది. నాకు తప్తినిచ్చే సుఖం కావాలి. అది నువ్వే ఇవ్వాలి. వయసు లేతది. తప్తి తీరని వయసే అది..అని అంతర్లీనంగా కూడా గ్రహించుకోవాలి. ఆమెలోని చురుకైన ప్రేమ ప్రవాహమై పరుగులు తీస్తుంది. ఆ ప్రవాహంలో తన ప్రియున్ని ఒక్క క్షణం మునిగి చూడమంటోంది. ఒక్క క్షణమే ఎందుకు మునగమన్నదంటే.. అందులో ఒక్క క్షణం మునిగినవాడు మళ్ళీ అదే సుఖాన్ని ఎప్పటికీ కోరుకుంటాడు కాబట్టి. ఇది వయసు మాయ. కోరికల మాయ…

ప్రతి నిమిషం కొత్తకొత్తగా ఉంటుంది. మెరుపులతో ఓ యుద్ధం జరిగినట్టుగా ఉంటుంది. శృంగారపు యుద్ధం జరుగుతున్నంతసేపు మెరుపులే కనబడతాయి. పెదవులు మురిసిపోతాయి. వయసులు విరిసిపోతాయి. ప్రేమికులైన ఇద్దరిలోన ఓ కొత్త కదలిక కలుగుతుంటోంది. అంతవరకు కలగని వింత కదలిక కలుగుతుంటోంది..
అబ్బాయి పెదవుల్లో తీయని మధువు ఉంది. ఆ మధువు ముద్దు అని అర్థమిక్కడ. ఆ మధువును తాగాలని కోరుకుంటోంది ఆ అమ్మాయి. అమ్మాయి పెదవిలోని మధువు గురించి చెప్పడం సర్వసాధారణం. అబ్బాయి పెదవిలోని మధువు గురించి చెప్పడం వినూత్నం. ఇదీ ఇక్కడ విశేషం. కోరికలతో ఊగే కోడె వయసులో ఉన్న అబ్బాయి తనువును తాకి మైకం అంతు చూడాలని ఆ అమ్మాయి ఆరాటపడుతోంది. ఆమె శరీరం సగం వింతవింతగా ఉంది అని అంటుంది. సగం వింతగా ఉందని ఎందుకు చెబుతుందంటే తన శరీరంలో తను సగమే, మరి మిగితా సగం ఆ అబ్బాయి అని భావిస్తుంది కాబట్టి.

నాకు మాత్రం వింతగా ఉంది. నీకు కూడా అలాగే ఉందా? అని అబ్బాయిని అంతర్లీనంగా ప్రశ్నించేదేమోనని అనుకోవచ్చు. లేదా.. కోరికలతో తిమ్మిరెక్కి సగం శరీరం పనిచేయలేదేమో అందుకే వింతవింతగా సగం శరీరం ఉందని అన్నదేమోనని కూడా భావించుకోవచ్చు. ఈ సరసం చాలా తీయనైనదని అంటోంది. సగం శరీరం వింతవింతగా ఉంటే, ఇంకో సగం ఉన్న చింతల్ని తీర్చిందని అంటోంది. అంటే.. చెప్పలేని సుఖాన్నిచ్చి వయసు వల్ల కలిగిన అలజడిని తీర్చిందని చెబుతోంది. ఇలా చెబుతూనే ఈ జగడం.. ఈ గొడవ మన ఇద్దరిదీ. సుఖం ఇద్దరిదీ. సంతోషం ఇద్దరిదీ. కోరికలు ఇద్దరివీ.. తృప్తి ఇద్దరికీ అనే విషయాన్ని స్పష్టం చెబుతోంది. ఇద్దరూ వయసులో ఉన్నారు కాబట్టే.. ఒద్దికగా కలిసిపోయారు. నీకూ నాకూ ఓ కొత్త నిప్పేదో లోన రగులుతోంది కదా.. అని చెబుతోంది.
చివరలో.. గుండెల్లో చెలరేగే వివాదం తగ్గడానికి నువ్వే సాయం చేస్తావా.. అగాథంగా ఉన్న తనువులో దూరి.. కథ సుఖాంతం చేస్తావా.. విరహం ముంచివేస్తోంది కాబట్టి.. నేను తట్టుకోలేకపోతున్నా.. కాబట్టి ప్రశాంతంగా నన్ను చంపేరు రా.. అని అడుగుతోంది. ప్రశాంతంగా చంపడమంటే.. ఇక్కడ శృంగారతపనతో ఉన్నాను కాబట్టి.. ఆ తపనను తీర్చు అనే అర్థంలో వాడినట్టుగా తెలుస్తోంది.
ఇది పూర్తిగా శృంగారప్రాయమైన గీతం..అ ద్భుతమైన భావనాపటిమ ఈ పాటలో నిండుగా కనిపిస్తోంది.


పాట:
గుండెల్లో ఓ వివాదం/ గజిబిజిగా ఉంది ప్రాయం/ తనువంతా ఓ అగాధం/ తపనల్లే ఉంది గాయం/ ముంచివేస్తుంది నాలో విరహం/ చంపివేస్తోందిలే ఏదో కలహం/ ఇచ్చి కౌగిలినే ఓ సహాయం చేస్తావా/ ఓ ప్రియా.. ఓ నా ప్రియా../ ఓ ప్రియా ఇక నీ దయా../ చిలిపివయసే ఓ ప్రమాదం చెదిరిపోయే నా సుఖం/ చురుకు వలపే ఓ ప్రవాహం/ మునిగిచూడరా ఓ క్షణం/ కొత్తకొత్తగా ఉందిలే సనం/ మెరుపులై సమరం/ మత్తుమత్తుగా ఉందిలే జగం/ మురిసెలే అధరం/ నీకూ నాకూ నవచలనం/ పెదవిలోన దాగి ఉన్న మధువు నన్నే తాగనీ/ వయసునున్న తనువు తాకి మైకమంతు చూడనీ/ వింతవింతగా ఉందిలే సగం/ తీయనీ సరసం/ ఉన్న చింతలే తీర్చెలే సగం/ ఇద్దరిదీ జగడం/ నీకూ నాకూ నవజ్వలనం/ గుండెల్లో ఓ వివాదం చేస్తావా చిన్ని సాయం/ తనువంతా ఓ అగాధం చేసేరు రా సుఖాంతం/ ముంచివేస్తోంది నాలో విరహం/ చంపివేసేరు రా నన్నీ శాంతం/ ఇచ్చి కౌగిలినే శృంగారం చేసేరు రా/ ఓ ప్రియా..నా ప్రియా..

– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -