నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి రెండో దఫా ఓటరు సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సార్‌లో భాగంగా ఇంటింటికి తిరిగి పలు పత్రాలు అందజేస్తున్నారు ఎన్నికల సిబ్బంది. ఈసీ సూచించిన 12రకాల గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రజల స్థానికతను అధికారులు దృవపరుస్తున్నారు. ఈ సర్వే మొత్తం 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈసీ చేపట్టనుంది. ఈ రెండో దశ ‘సర్’ ప్రక్రియ కిందకు వచ్చే యూటీలు, రాష్ట్రాలు ఏవనేది ఈసీ వర్గాలు వెల్లడించాయి.
అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి యూటీ జాబితాలో, ఛత్తీ్‌సగఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో 51 కోట్ల మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు.
సర్ ప్రక్రియ మంగళవారం మొదలై డిసెంబరు 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను డిసెంబరు 9వ తేదీన, తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈసీ విడుదల చేస్తుంది. స్వాతంత్య్ర భారతంలో ‘సర్’ ప్రక్రియను ఈసీ చేపట్టడం ఇది తొమ్మిదోసారి. చివరిగా 2002-04 మధ్య చేపట్టింది. ఇంతకుముందు బీహార్‌లో ఓటరు సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతం నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు, తమిళనాడులో ‘సర్’ ప్రక్రియను అడ్డుకోవాలంటూ అధికార డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాట ఆరుమాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో అత్యవసరంగా సర్ ప్రక్రియను చేపట్టడం ప్రజాప్రాతినిఽధ్య చట్టానికి వ్యతిరేకమని ఆ పిటిషన్‌లో భారతి తెలిపారు.

                                    

