నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో వరుస భూకంపాలు హడలెత్తించాయి. రాష్ట్రంలోని చంబ జిల్లాలో తెల్లవారుజామున 03:27 గంటలకు 3.3 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. అదే జిల్లాలో గంట తరువాత (4:39 గంటలకు) 4.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయందోళనలకు గురైయ్యారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అంతటా రుతుపవనాలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాలు కారణంగా జూన్ 20 నుండి మొత్తం మరణాల సంఖ్య 276కు పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రాణనష్టంతో పాటు వంతెనలు కొట్టుకుపోవడం, ఇళ్ళు, పశువుల కొట్టాలు, వ్యవసాయ భూములు మరియు పంటలు, స్మశాన వాటికలకు విస్తృత నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 1,104 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 37 దుకాణాలు, కర్మాగారాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.