Tuesday, September 30, 2025
E-PAPER
Homeమానవిపాట ఓ పోరాట రూప‌మే…

పాట ఓ పోరాట రూప‌మే…

- Advertisement -

విప్లవ పాటలు వింటూ పెరిగారు. కాళోజి నారాయణరావుతో కలిసి పనిచేసారు. వారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. విద్యార్థి, కార్మిక, మహిళా ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించారు. ఆర్థిక అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణం కోసం తన గొంతు విప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యం చేసే పాటలను పాడారు. ఉద్యమ సమయంలో ఎన్ని అవమానాలు, ఒడిదుడు కులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ఆమే వేముల పుష్ప. ఊపిరి ఉన్నంతకాలం పాడుతూనే ఉంటా అంటున్న ఆమెతో మానవి సంభాషణ…

మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా సాగింది?
అడ్డగూడూరు మండలం, కోటమర్తి గ్రామంలో 1980లో పుట్టాను. అమ్మ అండమ్మ, నాన్న కుంట్ల బిక్షం రెడ్డి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. తమ్ముళ్లిద్దరూ ఉద్యోగులే. చెల్లెలు గహిణి. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు కోటమర్తి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ తిరుమలగిరిలోని తిరుమల జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ నకిరేకల్‌ పట్టణంలోని వాసవి కళాశాలలో, ఎంఏ కాకతీయ యూనివర్సిటీ, ఎల్‌ఎల్‌బి ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను.

పాటల పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
మాది ఉద్యమాల కుటుంబం. మా ఇంటికి పార్టీ వాళ్లు, నక్సలైట్లు వచ్చేవారు. నాన్న ప్రేరణతో పుట్టుక నుండే పాటల పట్ల మక్కువ పెరిగింది. ఊరూరా తిరిగి వచ్చే ఉద్యమకారులు మా ఇంట్లోనే పాటలు ప్రాక్టీస్‌ చేస్తుండేవారు. అలా నేను కూడా నేర్చుకున్నాను. వాటిపై ఆసక్తి పెరిగింది. ఆ మక్కువతోనే పాటలు పాడేదాన్ని. ఆరవ తరగతిలోనే ఉద్యమంలో కొనసాగాను. మొదటిసారిగా మతోన్మాదానికి వ్యతిరేకంగా మా ఊళ్లోనే చంద్ర పుల్లారెడ్డిపై పాట పాడాను. ఏబీవీపీ గుండాలు ఉస్మానియా క్యాంపస్‌లో చేస్తున్న దాడులకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పాఠశాల తరగతులను బహిష్కరించి ఊళ్లోనే పెద్ద సభ నిర్వహించారు. ర్యాలీ కూడా చేసాం. అక్కడి నుండే నా పాటల ప్రయాణం కొనసాగింది.

వీరేశంతో మీ పరిచయం ఎలా ఏర్పడింది?
మా రెండు కుటుంబాలు ఉద్యమ కుటుంబాలే. ఇద్దరం విద్యార్థి ఉద్యమాలలో పనిచేశాం. తను సాంస్కతిక రంగంలో డప్పు కొడుతుండేవాడు. నేను పాటలు పాడుతుంటి. ఇద్దరం ఒకే టీంలో పనిచేసేవాళ్లం. ఉద్యమ కుటుంబంలో పనిచేసే విద్యార్థులకు ‘గ్రామాలకు తరలిరండి’ అంటూ ప్రతి వేసవిలో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ శిబిరంలో పాటల ప్రాక్టీస్‌, గ్రామీణ ప్రజల సమస్యలపై అవగాహన, బ్యాలే, డ్యాన్సులపై రెండు నెలలు క్లాసులు ఉండేవి. ఆ సందర్భంగా 1990లో శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి వచ్చాను. నేను పాటలు పాడుతుండగా వీరేశం డప్పు కొడుతుండే. అలా మా పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. ఆ రోజుల్లో కులం పోవాలని ఉద్యమాలు చేసిన కుటుంబంలో పుట్టిన నాకు కులాంతర వివాహానికి ఇరువైపుల పెద్దలు వ్యతిరేకించలేదు. కానీ మా అమ్మ అండమ్మ మాత్రం కొంత బాధపడింది. 2001, ఆగస్టు 2న మా వివాహం నకిరేకల్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరిగింది.

మీ ఉద్యమ అనుభవాలు పంచుకుంటారా?
2001 నుండి 2014 వరకు ఎన్నో అవమానాలు, చీత్కారాల మధ్య మా జీవితం సాగింది. విప్లవోద్యమంలో తను లోపల అడవిలో ఉండటం, నేను బయట ఉండటం. పోలీసుల వేధింపులు. శ్రీనివాసరావు సిఐగా ఉన్న కాలంలో నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌కు ప్రతిరోజు వెళ్లి సంతకం పెట్టేదాన్ని. ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితిలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య పోలీసులతో మాట్లాడారు. జెడ్పిటిసి నోముల వెంకన్న వకాలత్‌గా నన్ను పోలీస్‌ స్టేషన్‌ నుండి విడిపించారు. అందాల పోటీలకు వ్యతిరేకంగా, నకిరేకల్‌లో స్థానిక సంఘటన సందర్భంగా చేసిన రాస్తారోకో, తెలంగాణ ఉద్యమంతో కలిపి మొత్తం నాపై 11 కేసులు ఉన్నాయి. మేమిద్దరం ఉద్యమాలకు వచ్చినప్పుడే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాం. కానీ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి పెట్టిన వేధింపులు ఎక్కువగా బాధించేవి. మరీ బాధించిన సంఘటన ఏమిటంటే రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్‌ అధికారి 15 రోజులు మా ఇంట్లో ఉండి ఉదయం నుండి సాయంత్రం వరకు వీరేశంను లొంగిపొమ్మని వేధించేవాడు. జీవనం కోసం రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న తనను అక్కడికి కూడా వెళ్లి హింసించేవాడు. మాకు ఇద్దరు పిల్లలు. బాబు విపుల్‌ బిటెక్‌ చేసి ఎంబీఏ పూర్తి చేశాడు. పాప వినూత్న ఎంబిబిఎస్‌ రెండవ ఏడాది చదువుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పాస్‌ పోర్టు రాక ఇబ్బందులు పడ్డాం. నావల్ల వీరేశం కూడా ఇతర దేశాలకు పోలేక పోయిండు. ఏడాది కిందటనే నాకు పాస్‌ పోర్టు వచ్చింది.

మీ పాటల ప్రస్థానం ఎలా సాగింది?
సాంస్కతిక రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు నిత్యం పాడుతూనే ఉన్నాను. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు పాటలు పాడుతూ డ్యాన్సులు చేసే వారం. సమస్యలు వచ్చినప్పుడు వందలకొద్దీ పాటలు పుట్టుకొచ్చేవి. ప్రపంచ బ్యాంకు షరతులు, వేప చెట్టు, పసుపు, పేటెంట్‌ హక్కు కోసం అమెరికా చేసిన ప్రయత్నం, ప్రపంచ అందాల పోటీలు, మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పాడిన పాటలు కోకోల్లలు. నేను స్వయంగా పాడిన ఆరు పాటలు సిడి రూపంలో ఉన్నాయి. బొంబాయి పాట, బియ్యాల జనార్దన్‌ రావు, మహిళా కార్మికులు, అమరవీరులపై పాడిన పాటలు. ‘బతుకు దరువు కని/ అమ్మ మాయమ్మ/ బొంబాయికి పోతున్న… అమ్మ మాయమ్మ / చేతగాని దాని కొడుకా మల్లయ్య / ముసలి పానం నాది బిడ్డ మల్లయ్య..’ అంటూ సాగునీరు లేక బీడుబడ్డ భూములతో కరెంటు కోతలతో బతికే పరిస్థితి లేనప్పుడు తెలంగాణలో 50 శాతం మంది ప్రజలు బొంబాయి, మస్కట్‌, ఇతర దేశాలకు వలస పోయారు. ఆ కార్మికుల మీద నాటకాలు కూడా వేసాం. బొంబాయి పాటకు నేను, పైలం సంతోషన్న కలిసి 13 రాష్ట్రాలలో వేల ప్రదర్శనలు ఇచ్చాం. ప్రజలలో కులం, వర్గ బేధాలు పోయి అంతా సమానంగా బతికినప్పుడే నా జీవితానికి ఓ అర్థం. ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసం బతికి, తమకంటూ సొంత ఆస్తి, సంపాదన లేకుండా చివరకు సొంత పేరు కూడా లేకుండా ప్రజల కోసం ప్రాణాలిచ్చిన బిడ్డల పాటలు పాడటం అంటే నాకెంతో ఇష్టం.

ఓ ఎమ్మెల్యేకు జీవన సహచరిగా వీధుల్లో పాటలు పాడుతున్నారు.. ఇబ్బంది ఏమీ లేదా?
నేను పాటలు పాడటం, రోడ్డు మీద ఉండటం చాలా మందికి మింగుడు పడదు. ‘ఎమ్మెల్యేకు భార్య అయ్యి ఈమెందుకు రోడ్డు మీద ఉంటది.. పాటలు పాడటం ఈమెకేమవసరం’ అంటారు. డిగ్నిటీ లేదంటారు. కానీ నా డిగ్నిటీ లేబర్‌ ఏమిటంటే.. బతికినంత కాలం పాట పాడాలి. పేద ప్రజల పక్షాన నిలబడాలనేది నా లక్ష్యం. ప్రజలతో ఉండటానికి ఇష్టపడతా. వారితో ఉంటేనే నాకు సంతోషం. మేమిద్దరం ఉద్యమ సహచరులుగా, జీవిత సహచరులుగా ఉన్న ఈ 24 ఏండ్లలో ఏనాడు నా నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని వీరేశం వ్యతిరేకించలేదు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఇద్దరి మధ్యన సంఘర్షణ కచ్చితంగా ఉంటుంది, చర్చించుకుంటాం. తన అభిప్రాయం తాను చెబితే, నా అభిప్రాయం నేను చెబుతా. చివరికి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని తర్వాత ఎవరి తప్పుంటే వారు సరిదిద్దుకుంటాం. గొడవలు మాత్రం ఉండవు. మీరు చూస్తున్న ఎమ్మెల్యే వీరేశం వేరు. నేను ఇంట్లో చూస్తున్న వీరేశం వేరు. ఇప్పటికీ తన ప్లేటు తనే కడుక్కుంటడు. గర్వం ఉండదు. వర్కర్లు రాకపోతే మా పనులు కూడా చేస్తాడు. ఎప్పటికీ ప్రజల పక్షాన ఉండి వారి కోసం మాట్లాడటానికి, ప్రజలకు చేతనైనంత సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు మమ్మల్ని కూడా అదే బాటలో నడిపిస్తున్నాడు.

మీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు..?
ప్రజా సంక్షేమం కోసం పాటల రూపంలో, పాదయాత్ర రూపంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించాం. పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో దేవరకొండ ప్రాంతంలో అంగట్లో ఆడబిడ్డలను అమ్ముతున్న పరిస్థితులు మమ్ములను కదిలించాయి. ఆడబిడ్డల అమ్మకాలకు వ్యతిరేకంగా కోదాడ నుండి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర నిర్వహించాం. రైతులు పత్తి పంట సాగు చేసి పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలు చేసుకుంటుండే. పత్తి రైతుల ఆత్మహత్యలకు నిరసనగా రెండుసార్లు సూర్యాపేట నుండి హైదరాబాద్‌ వరకు పాదయాత్రలు చేశాం. ప్రస్తుతం తెలంగాణ సాంస్కతిక సారథి కళాకారినిగా కొనసాగుతున్నాను.

పాట గురించి మీరేం చెబుతారు?
పోరాట రూపం అంటే పాటే. ప్రజల దగ్గర పాట పాడినప్పుడు వారు కొట్టే చప్పట్లే మాకు అవార్డులు. పాటకు అనుగుణంగా నటించి ప్రజలను మెప్పించినప్పుడు ‘నీలో నా బిడ్డ కనబడ్డది, రైతుల బాధ కనబడ్డది, నా బాధ కనబడ్డది’ అని చెప్పి వారు పెట్టే కన్నీళ్లే అవార్డుల కంటే ఎక్కువ. అయినా అవార్డులను నేను ఏనాడు ఆశించలేదు. జిల్లా ఉత్తమ గాయని అవార్డుకు నేనే మరొకరిని ఎంపిక చేసి ఇప్పించాను.

  • యరకల శాంతి కుమార్‌,9849042083
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -