భూమి పొరలు.. ఆడపిల్ల మనసు అంతుచిక్కని అగాధాలు.. స్త్రీత్వపు అస్తిత్వపు జాడలకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఆడపిల్ల ఆంతరంగిక మనసును తనదైన శైలిలో అక్షరాలలో పేరుస్తారు రచయిత్రి గొర్తి వాణి శ్రీనివాస్. జీవితం ఒక అందమైన పుస్తకమైతే అందులోని ప్రతి అక్షరం ఆప్త శబ్దాన్ని తలపిస్తూ ఆత్మను స్పశించాలి. సమస్యను అణువుగా పోల్చుకుంటే, దాని చుట్టూ తిరిగే ఎన్నో అంశాలు ఆ అణువు పరిమాణాన్ని పెంచి చూపిస్తుంటాయి. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అని సందేహం వచ్చినప్పుడు సమస్య కన్నా సమస్యేతర శక్తులను వదిలించుకునే ప్రక్రియ మొదలుపెట్టాలి. దీర్ఘ వత్తాలలో చిక్కుబడిన మమకారపు వెల్లువలోంచి మనసును ఒడ్డుకు చేర్చే నేర్పు కావాలంటే, సమస్యను చాలా దూరం నుంచి చూడగల నైపుణ్యం సాధించాలి. అప్పుడే మన మనసుని ముసిరిన చీకట్లలోకి చిన్న కాంతి పుంజాన్ని ప్రవేశపెట్టగలుగుతాము. పరిష్కార వైద్యాన్ని చేసుకోగలము. ఎదలో కాల్చే మంటను ఆర్పే సైన్యం ఎవరో కారు. మనకు మనమే. రచయిత్రి గొర్తి వాణి శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన నవల ‘వెన్నెల ధార ‘ లోని పాత్రలు అద్భుతంగా చరిస్తాయి. ఆ పాత్రల నైజం, ప్రవర్తనలు, మనలో భావోద్వేగాలు కలిగిస్తూ, వారంతా మనలో ఒకరేమో అన్నట్లుగా మనల్ని ప్రభావితం చేస్తాయి. మహిళల హదయ భాష తెలిసిన రచయిత్రి పలు సందర్భాలలో భావోద్వేగాలను , అనుభూతులను తన భాషా సౌందర్యంతో వర్ణించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది.
అందం, ఆకర్షణ, వ్యామోహం యుక్త వయస్సు ఆడపిల్ల ను ఎంతగా మనసుకల్లోలం, సంఘర్షణలు, అంతర్మధనాలు చేయిస్తాయో ఈ నవల అద్దం పడుతుంది . ప్రేమ, సున్నితత్వం మేళవింపుతో ఓలలాడే కన్నె ప్రపంచం ఊహకు, వాస్తవానికి మధ్య ఉన్న అంతరాన్ని తెలుసుకొని ముందుకు పోయే రాధ పాత్ర ఎందరో పాఠకుల మదిలో పదిలమవుతుందని అనడంలో సందేహం లేదు. ఈ నవలాకారిణి వాణి శ్రీనివాస్ ఆడపిల్ల మనసు భావాలకు అక్షర రూపం కట్టి పాఠకుల ముందు పెడతారు. ఆడపిల్ల పెంపకం, బాధ్యత పట్ల తల్లిదండ్రుల నిజమైన మనోవేదన, తపన ఇందులో ప్రతిబింబిస్తాయి. మంచి భాషా పరిజ్ఞానంతో మనసు భావుకతకు అక్షర రూపం ఇచ్చి ప్రతి సన్నివేశం కళ్ళెదుట సాక్షాత్కరింపజేయటం రచయిత్రి వైవిధ్య రచన శైలికి నిదర్శనం.
‘కారు మేఘాలు కమ్ముకు వచ్చినా, విధి గర్జించి ముంచెత్తినా ఆత్మవిశ్వాసం తోడుంటే గడ్డి పరక కూడా విజయదుందుభి మోగిస్తుంది’ అని ఓడి గెలిచిన రాధ ఆత్మవిశ్వాసాన్ని ఈ నవలలో ప్రదర్శించటం ప్రతి ఆడపిల్లకు పాఠంలా, గుణపాఠంలో పనిచేస్తుంది. శారీరక అందం తరిగిపోయేదే ..మాయని మనసుదే అగ్రస్థానమని చెబుతారు .బాధ్యతగా మారే ప్రేమ విలువను చాటుతారు .తన బావ నివాస్ లో మార్పు వస్తే తల్లడిల్లే రాధ మనసును అద్భుతంగా అక్షరీకరించారు.
నవల ఉత్తమ పురుషలో కొనసాగి, రచనలో మంచి పరిపక్వత కనిపిస్తుంది. ఆడపిల్ల మనస్తత్వం కేంద్రంగా , స్త్రీవాద రచయిత్రిగా వాణి ఈ నవలలో రాధను అనేక అడ్డంకుల నుంచి ముందుకు తీసుకెళ్లి నిలబెడుతుంది. నవల చదవడం ఆరంభించిన దగ్గర నుంచి వదలకుండా చదివింపచేసే రచయిత్రి వాణి రచన శైలి, భాషా నైపుణ్యం , భావోద్వేగత, సంభాషణలు సన్నివేశాలు, హదయభాష తో గల అలౌకిక భావనలు మహిళలను తట్టి లేపుతాయి. ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల మనసు ప్రేమ, సంఘర్షణలతో అల్లకల్లోలం అయ్యే తీరును వర్ణించిన విధానం ప్రతి మనసుని మెలిపెడుతుంది.
ఇదొక అమ్మాయి కథే కాదు. కూతుర్ని ప్రేమించే తండ్రి కథ కూడా. అమ్మాయిలో చక్కటి ఆత్మీయురాల్ని చూసుకునే ఓ అజ్ఞాత స్నేహితుడి కథ. మనకు తెలిసిన, మనలో మసలే కొందరి వ్యక్తుల కథ ఇది. ప్రేమించడం ఓ బలహీనత.. అది మనని మనతోనే ఓడిస్తుంది .ప్రేమకు గంతలు గట్టి ఆడించిన నివాస్ ను వదిలించుకునే ఆత్మస్థైర్యం రాధలో చేకూర్చి సమాజంలో ఇటువంటి రాధలు ఏ విధంగా ఆత్మస్థైర్యం కూడగట్టుకోవాలో, జీవితాన్ని ఏ విధంగా కొత్తగా మలుచుకోవాలో ఒక పాఠంలా చెబుతుంది. కపట ప్రేమ నుంచి బయటపడటానికి ఆత్మ శరీరం నుంచి విడిచి బయటకు వచ్చే ముందు ఎంత బాధ పడుతుందో అంత బాధపడి విముక్తి పొందుతుందని రాధ పాత్ర చెబుతుంది.
ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సంఘటనలు, సమస్యలకు పరిష్కారం చెబుతుంది. జీవితానికి ముగింపు తెలిపేది కాలమేనని, దానిని అనుసరిస్తూ పోవడమే కర్తవ్యమని ఈ నవలలో జీవితసారం అందిస్తారు. చివరకు నాన్న నమ్మకమైన మాధవ్ బావను సుధామ పాత్ర ద్వారా నాటకీయంగా మలుపు తిప్పి కలపడం రచయిత్రి రచన కౌశలానికి దర్పణం . రాధ మానస మధువనంలో వెన్నెల ధారలు కురిసి కథ సుఖాంతం అవుతుంది. చక్కని శైలి, శిల్పాలతో కథ మలచిన రచయిత్రి గొర్తి వాణి శ్రీనివాస్ అభినందనీయులు. యుక్త వయసు ఆడపిల్లకు పలు సందర్భాలలో జరిగే థాట్ ప్రాసెస్ కు మేలిమి ఉదాహరణగా, ఆమెకు పలు దశలలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారంగా తలుపులు తెరిచే నవల ఇది.
– మంత్రిప్రగడ శ్రీనివాసరావు, 9948696644
ఆడపిల్ల మనసు పొరల గాథ.! వెన్నెల ధార..!!
- Advertisement -
- Advertisement -