Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఘోర విషాదం.. 68 మంది జలసమాధి

ఘోర విషాదం.. 68 మంది జలసమాధి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యెమెన్ సముద్ర తీరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు వెళ్తున్న ఇథియోపియా వలసదారులతో కూడిన పడవ బోల్తా పడింది. నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 74 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) అధికారికంగా వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఇథియోపియాకు చెందిన సుమారు 154 మంది వలసదారులు ఒక పడవలో యెమెన్ మీదుగా గల్ఫ్ దేశాలకు బయలుదేరారు. యెమెన్‌లోని దక్షిణ అబ్యాన్ గవర్నరేట్ తీరానికి సమీపంలోకి రాగానే వీరి పడవ అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది.

ఈ ప్రమాదం నుంచి కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక అధికారులు వారిని రక్షించి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు తీరానికి కొట్టుకువస్తుండటంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలోని ఇథియోపియా, ఎరిట్రియా వంటి దేశాల్లో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కరవు, అంతర్యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రాణాలకు తెగించి సౌదీ అరేబియా వంటి సంపన్న దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు యెమెన్‌ను ఒక రవాణా మార్గంగా ఎంచుకుంటున్నారు. పదేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ మీదుగా ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా బతుకు పోరాటంలో వలసదారులు వెనక్కి తగ్గడం లేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad