సురవరం సుధాకర్‌రెడ్డికి సీపీఐ(ఎం) నివాళి
న్యూఢిల్లీ : సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి మృతిపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. కార్మిక వర్గం, అణచివేతకు గురైన ప్రజల కోసం తన జీవితాంతం పోరాడిన యోధుడిగా సుధాకరరెడ్డి, న్యాయం, సమానత్వం, సోషలిజం వంటి ఆదర్శాలకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలులో, ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పనిచేసిన తొలినాళ్ల నుంచి చారిత్రక యువజన, విద్యార్థి పోరాటాల్లో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్‌లకు నాయకత్వం వహించినప్పుడు ఆయన, ప్రజాస్వామిక హక్కులు, సామాజిక పరివర్తన వంటి అంశాల పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించారని పొలిట్‌బ్యూరో వివరించింది. ”నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రెండు పర్యాయాలు కామ్రేడ్ సురవరం విజయం సాధించారు. తన సమగ్రత, శాసనపరమైన అంతర్ దృష్టి, కార్మికుల హక్కుల నుంచి వ్యవసాయ దుస్థితి వరకు అనేక అంశాలపై తన వాదనకు చిట్టచివరి వరకు నిలబడ్డారు. క్షేత్రస్థాయిలో ఆయన అనేక శక్తివంతమైన ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి (2012-2019)గా మతోన్మాదం, నియంతృత్వాలకు వ్యతిరేకంగా సమైక్య కార్యాచరణను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీపీఐ విశిష్ట నేతల్లో ఒకరిగా వామపక్ష పార్టీలు, శక్తుల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం కోసం ఆయన సాగించిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని పేర్కొన్నది. భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులందరికీ, కామ్రేడ్ సురవరం భార్యా పిల్లలకు పొలిట్‌బ్యూరో తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసింది.
జీవితాంతం పోరాడిన యోధుడు
- Advertisement -
- Advertisement -



