– బిఆర్ఎస్‌లోకి జనసేన అభ్యర్థి!
– అయోమయంలో కార్యకర్తలు.. ప్రశ్నార్థకంగా అభ్యర్థుల భవితవ్యం
నవతెలంగాణ–పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు తమ పార్టీ గెలుపు కోసం నినదించిన అభ్యర్థులు, నేడు గూడు మారుతుండటంతో స్థానిక రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. తాజాగా జనసేన పార్టీకి చెందిన 17వ వార్డు అభ్యర్థి ఇనగల భారతి ఆదివారం అధికార పార్టీ (బిఆర్ఎస్)లో చేరడం తీవ్ర చర్చకు దారితీసింది.ఎన్నికల గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన పార్టీల ‘ఆకర్ష్’ మంత్రం పరాకాష్టకు చేరింది. మొన్నటి వరకు అభ్యర్థుల వెన్నంటి ఉండి ప్రచారం చేసిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల లాబీయింగ్‌లకు లోనవుతున్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో బలం ఒక్కసారిగా తారుమారవుతోంది. తమ నాయకుడు గెలుస్తాడని నమ్మి పనిచేస్తున్న కార్యకర్తలు, చివరి నిమిషంలో ఖండువాలు మారుస్తుండటంతో అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది.ఓట్ల సమీకరణల కోసం ప్రధాన పార్టీలు వేస్తున్న ఎత్తుగడల్లో చిన్న పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
వరుస షాక్‌లతో కుదేలవుతున్న విపక్షాలు
పరకాలలో ప్రధాన పార్టీల వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా తలొగ్గుతున్నారు.ఇటీవల కాలంలో బిజెపికి చెందిన ఒక అభ్యర్థి బిఆర్ఎస్‌లో చేరగా, అదే బాటలో ఇప్పుడు జనసేన అభ్యర్థి ఇనగల భారతి కూడా వెళ్లారు.వార్డు అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్లు ఆమె ప్రకటించినప్పటికీ, ఎన్నికల ముంగిట ఈ పరిణామం ఓటర్లలో అనుమానాలకు తావిస్తోంది.అభ్యర్థులు, కార్యకర్తలు ఇలా కప్పదాట్లు వేస్తుండటంతో సామాన్య ఓటర్లు విస్మయానికి గురవుతున్నారు. “నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కన పెట్టి, కేవలం నజరానాల కోసమో లేదా అవకాశవాదం కోసమో పార్టీలు మారడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే” అని పలువురు పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి బలం ఎంతో తేలడానికి సమయం దగ్గర పడుతుండటంతో, ఈ ‘జంపింగ్’ రాజకీయాలు ఎవరిని గెలిపిస్తాయో.. ఎవరిని ముంచుతాయో వేచి చూడాలి.
పరకాలలో రాజకీయ ‘జంపింగ్’ల పర్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



