నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంకా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టని వారికి వారం రోజులు గడువు ఇస్తున్నామని, వారం రోజుల తర్వాత కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టని యెడల లబ్దిదారుల స్థానంలో వేరే లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించే విధంగా చూడాలని ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
గురువారం నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంతోపాటు కొల్చారం, కౌడిపల్లి మండలాలలో గల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి వీపీ గౌతమ్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లబ్దిదారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేస్త్రీలు ఎక్కువ ఇండ్లు కాంట్రాక్ట్ తీసుకోవడం మూలంగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా లబ్దిదారులు వెల్లడించారు.



