నవతెలంగాణ-హైదరాబాద్: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని రుద్రవరం గ్రామంలో స్క్రబ్ టైఫస్ పురుగు కుట్టడంతో అరుదైన వ్యాధి లక్షణాలతో యువతి మృతి చెందిన ఘటన మండలంలో కలకలం రేపింది. గత నెల 1వ తేదిన తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, శ్వాస, జీర్ణకోశ సమస్యలతో గ్రామానికి చెందిన మోరబోయిన జ్యోతి(19)మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్యోతి పదో తరగతితో చదువు ఆపివేసి పొలం పనులకు వెళ్ళుతుండేది.
ఈ క్రమంలో వరి పొలంలో పురుగు కుట్టగా ఏదో కుట్టిందిలే అని అంతగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకు జ్వరం రావడంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకోవడంతో జ్వరం తగ్గిపొయింది. జ్వరం తగ్గిన వాంతులు, విరేచనాలు ప్రారంభం అవ్వడంతో పురుగు కుట్టిన చోట దద్దుర్లు వచ్చి పుండు ఏర్పడడం తీవ్ర అనారోగ్యంతో చికిత్స నిమిత్తం సతైనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్ కు వెళ్ళవలసినదిగా సూచించారు.
జ్యోతి కుటుంబ సభ్యులకు మంగళగిరి ఎయిమ్స్ లో తెలిసిన వాళ్ళు ఉండడంతో అక్కడ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఆమె రక్త నమూనాలు సేకరించి అక్కడ ల్యాబ్ లో పరీక్షలు జరపగా ఆమెకు స్క్రబ్ టైఫస్ పురుగు కుట్టడం వలన అరుదైన వ్యాధి లక్షణాలతో మృతి చెందిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనితో గ్రామంలో అందోళన వాతావరణం నెలకొంది.



