నవతెలంగాణ – హైదరాబాద్: ‘కూలీ’ సినిమాలో అసలు హీరోలు సూపర్‌స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునలేనని, తానొక ‘అతిథి’ని మాత్రమేనని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ అన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాకు భారీ ఎత్తున తరలివస్తున్నారంటే అది వారిద్దరి కోసమే కానీ, తన కోసం కాదని వినమ్రంగా తెలిపారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో తన పారితోషికంపై వస్తున్న పుకార్ల పట్ల ఆమిర్ ఖాన్ స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ‘కూలీ’ చిత్రంలో నటించినందుకు తాను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని స్పష్టం చేశారు. “రజనీకాంత్‌పై నాకున్న అపారమైన ప్రేమ, గౌరవానికి వెల కట్టలేం. ఆయనతో కలిసి స్క్రీన్ పంచుకోవడమే నాకు దక్కిన గొప్ప బహుమతి” అని ఆమిర్ పేర్కొన్నారు. ఆయనపై అభిమానంతోనే ఈ సినిమాలో నటించానని తేల్చిచెప్పారు.
‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ కీలక అతిథి పాత్ర పోషించారు. అయితే, ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా రూ. 20 కోట్లు తీసుకున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. చిత్ర బృందం ఈ వార్తలను ఖండించినా, పుకార్లు ఆగలేదు. తాజాగా ఆమిర్ ఖాన్ స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి పూర్తిగా తెరపడినట్లైంది.
ఆగస్టు 14న విడుదలైన ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ‘దాహా’ అనే పాత్రలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.