Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంఆప్‌ నిజాయితీ కలిగిన పార్టీ: కేజ్రీవాల్‌

ఆప్‌ నిజాయితీ కలిగిన పార్టీ: కేజ్రీవాల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తాను, సిసోడియా ఇద్దరూ నిజాయితీపరులమని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ రౌస్‌ అవెన్యూ కోర్టు తనను విడుదల చేసిన తర్వాత, కోర్టు వెలుపల ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాను అవినీతిపరుడిని కాదని, తాను, సిసోడియా ఇద్దరం కూడా నిజాయితీ పరులమని కోర్టు వెల్లడించిందని అన్నారు. ఆప్‌ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా రాజకీయ కుట్ర పన్నారని మండిపడ్డారు. ఆప్‌ పార్టీలో ఐదుగురు అగ్రనేతలను అంతం చేయాలని బిజెపి ప్రణాళిక వేసిందని, అదే సమయంలో ‘ఎప్పటికైనా సత్య విజయం సాధిస్తుంది’ అని తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని అన్నారు.

సత్యం విజయం సాధించిందని మరో ఆప్‌ నేత మనీష్‌సిసోడియా కోర్టు తీర్పును ప్రశంసించారు. ‘సత్యమేవ జయతే’అని అన్నారు. నేడు మరోసారి, అంబేద్కర్‌ దార్శనిక ఆలోచన మరియు ఆయన రూపొందించిన రాజ్యాంగం పట్ల తాను గర్వపడుతున్నానని అన్నారు. మోడీ, ఆయన పార్టీ, అన్ని సంస్థలు తాము అవినీతి పరులమని నిరూపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, చివరికి కేజ్రీవాల్‌, నేను నిజాయితీపరులమని నిరూపితమైందని అన్నారు.

తెలంగాణ నేత కవిత మాట్లాడుతూ.. సత్యమేవ జయతే అన్నారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగా ఈ కేసులో తనను ఇరికించారని, మోసగించారని అన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో న్యాయవ్యవస్థ అసత్యాలను చీల్చి చెండాడింది అని అన్నారు.

కేజ్రీవాల్‌, సిసోడియా, కవితలకు ఊరట
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ నేత కవితలకు భారీ ఊరట లభించింది. రాజకీయంగా వివాదాస్పదమైన ఎక్సైజ్‌ పాలసీ కేసులో వారిని నిర్దోషులుగా ఢిల్లీ కోర్టు శుక్రవారం ప్రకటించింది. సిబిఐ చార్జిషీటును పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది. వారితో పాటు మరో 21మందికి ఈ కేసులో క్లీన్‌చిట్‌ లభించింది.

గతంలో ఆప్‌ ప్రభుత్వం రద్దుచేసిన ఎక్సైజ్‌ పాలసీని రూపొందించడం మరియు అమలు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసి, సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కేజ్రీవాల్‌ ఎటువంటి ఆధారలు లేవని, సిసోడియాపై ప్రాథమికంగా ఎటువంటి కేసు లేదని పేర్కొంటూ, దర్యాప్తులో సిబిఐ లోపభూయిష్టంగా వ్యవహరించిందని ప్రత్యేక జడ్జి జితేంద్ర సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కొన్ని తప్పుదారి పట్టించే వాదనలను’ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. చార్జిషీటులో పలు అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలు లేవని, అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. చార్జిషీటు అంతర్గత వైరుధ్యాలతో బాధపడుతోందని, కుట్ర ఉన్నట్లు తేలిందని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేనందున, కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలను ధృవీకరించలేమని, స్పష్టమైన ఆధారాలు లేకుండానే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇరికించారని ఆయన అన్నారు. ఇది చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. సిసోడియా ప్రమేయాన్ని నిరూపించే ఎటువంటి ఆధారాలు రికార్డులో లేవని, ఆయన నుండి ఎటువంటి రికవరీ కూడా జరగలేదని జడ్జి అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -