నవతెలంగాణ – హైదరాబాద్: పాక్ నిర్దేశించిన స్వల్ప ఛేదనను భారత్ ధాటిగా మొదలెట్టింది. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో అభిషేక్ శర్మ (31) మొదటి రెండు బంతులకు 4, 6 బాదాడు. రెండో ఓవర్లో సయీం అయూబ్‌ను ఉతికేస్తే శుభ్‌మన్ గిల్(10) రెండు ఫోర్లు కొట్టాడు. అయితే.. ఆఖరి బంతికి షాట్ ఆడబోయిన గిల్ స్టంపౌట్ అయ్యాడు. వికెట్ పడినా సరే అభిషేక్ జోరు తగ్గించలేదు. సయీంను లక్ష్యంగా చేసుకొని రెండు బౌండరీలు సాధించిన అతడు అతడి ఓవర్లోనే వెనుదిరిగాడు.
అభిషేక్ ఔటయ్యాక వచ్చిన తిలక్ వర్మ(15 నాటౌట్) సైతం ఫోర్లతో చెలరేగాడు. నవాజ్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లతో జట్టు స్కోర్ 60 దాటించాడు. దాంతో.. పవర్ ప్లేలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 61 స్కోర్ చేసింది. ఇంకా టీమిండియా విజయానికి 67 పరుగులు కావాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు.