నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న భారీ లారీ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయిన డ్రైవర్, సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మృతి చెందినట్టు గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ లారీ అర్ధరాత్రి సమయంలో ములకలపల్లి సమీపంలోని పాములేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. దీంతో దాదాపు 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు,పోలీసులు స్పందించి ఫైర్ (రెస్క్యూ టీంకు ) సమాచారం అందించారు. లోయలో పడటం లారీలో ప్రమాదకరమైన యాసిడ్ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సుమారు 8 గంటల పాటు రెస్క్యూ టీం శ్రమించి లారీని వెలికితీసే ప్రయత్నం చేసింది.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. రెస్క్యూ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ, లారీ నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్‌ను ప్రాణాలతో కాపాడలేకపోయారు. చివరకు అతడు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు (డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం, లేదా సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది. లారీలోని యాసిడ్ లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.



