– ఉద్యోగాలు వదిలేసి నిరాహార దీక్షలు
– స్థానిక నేతల జోక్యంతో సమస్యకు తాత్కాలిక పరిష్కారం
రాంచీ: జార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలో ఉన్న అదానీ పవర్ ప్లాంట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగాలు వదిలేసి నిరాహార దీక్షలకు దిగారు. ఈ ప్లాంటు నుండే బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా జరుగుతోంది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కంపెనీ విఫలమవడంతో ఆందోళన చేస్తున్నామని కార్మికులు తెలిపారు. ఇటు కార్మికుల నుండే కాకుండా అటు బంగ్లాదేశ్‌లోని నూతన ప్రభుత్వం నుండి కూడా అదానీకి సెగ తగులుతోంది. విద్యుత్ ధరపై కంపెనీకి, బంగ్లా ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.
రిద్ధి కార్పొరేట్ సర్వీసెస్ అనే కంపెనీ పేరిట కొందరు ఉద్యోగులకు వచ్చిన ఈ మెయిల్స్ ఈ ఆందోళనకు కారణమైంది. తన క్లయింట్ అయిన అదానీ పవర్ కోసం మిమ్మల్ని ఉద్యోగులుగా నియమిస్తున్నామని మార్చి 30న వారికి మెయిల్స్ వచ్చాయి. అంతేకాదు…ఈ నియామకం 2023 మే ఐదవ తేదీ నుండే అమలులోకి వచ్చిందని తెలిపింది. అంటే వీరిని అదానీ పవర్ ఉద్యోగులుగా పరిగణించరు. కాంట్రాక్ట్ సంస్థ ఉద్యోగులుగానే చూస్తారు. ఈ మెయిల్స్ పంపిన నాలుగు రోజుల తర్వాత 180 మంది ఉద్యోగులను రెండో కంపెనీకి బదలాయించారు. దీంతో వారంతా నిరసనకు దిగారు. పవర్ ప్లాంట్ ప్రధాన గేటు పక్కనే ఓ చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని నిరాహార దీక్షలు మొదలెట్టారు.
నమ్మించి మోసం చేశారు
విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చాలా మంది కార్మికులు తమ భూములు అప్పగించారు. అయితే అనుకున్న ప్రకారం కాకుండా కొద్ది మొత్తంలోనే నష్టపరిహారం పొందారు. ఐదున్నర లక్షల రూపాయల నగదు లేదా ప్లాంటులో ఉద్యోగం ఇస్తామని నమ్మించి వారి భూములు తీసుకున్నారు. చాలా మంది కార్మికులు తమ జీవితాలకు భద్రత చేకూరుతుందన్న ఉద్దేశంతో నష్టపరిహారం తీసుకోకుండా ఉద్యోగాలు పొందారు. తమను అదానీ పవర్ సంస్థ నేరుగా నియమించు కుంటుందని అనుకుంటే తీరా ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ కంపెనీ ద్వారా మెయిల్స్ పంపారని వారు మండిపడ్డారు. తమ కంపెనీ, అదానీ పవర్ ఒకటేనని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు మమ్మల్ని మరో కంపెనీని మార్చేశారు. రేపు పశువుల మాదిరిగా మూడో కంపెనీకి తరలించ వచ్చు’ అని ధ్వజమెత్తారు. తమను అదానీ పవర్ ఉద్యోగులుగా పరిగణించి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కార్మిక నేత మండిపాటు
కార్మికులకు తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యో గాలు ఇవ్వడాన్ని కార్మిక సంఘం నేత గౌతమ్ మోడీ విమర్శించారు. ఇలా చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుం దని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా ఇలాగే భూములు తీసుకొని తాత్కాలిక కాంట్ట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగాలను కూడా ఊడబెరుకు తారని అన్నారు. హౌస్‌కీపింగ్ ఇచ్చిన ఓ వ్యక్తిని విధుల నుండి తొలగించడంతో అతను ఇంటి వద్ద ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్లాంటులో పనిచేయ డానికి ఎక్కడెక్కడి నుండో కార్మి కులను తీసుకుంటున్నారని, కానీ స్థానికులకు మొండిచేయి చూపు తున్నారని మండిపడ్డారు. ఈ పరిణామంపై కంపెనీ యాజ మాన్యం డొంకతిరుగుడు సమా ధానం చెబు తోంది. నైపుణ్యం కలిగిన స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇస్తు న్నామని మెలిక పెడుతోంది.
కొసమెరుపు
కార్మికుల నిరసనను గత నెల 6వ తేదీన పోలీసులు భగం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి ఒకరు జోక్యం చేసుకొని ఉద్యోగులు, యాజమాన్యం మధ్య ఒప్పందం కుదిర్చారు. ప్రస్తుతానికి ఔట్‌సోర్సింగ్ కంపెనీలో చేరాలని, భవిష్యత్తులో అదానీ పవర్‌లో అవకాశాలు వచ్చేలా చూస్తామని స్థానిక నేతలు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆ కంపెనీలో చేరిపోయారు.