నిత్యం కరువుతో అల్లాడిపోయే ఆ ప్రాంతం ఇప్పుడు పండగ చేసుకుంటుంది. అందుకు కారణం లేకపోలేదు. ఆ ప్రాంతానికి చెందిన ఓ సామాన్య ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అధికారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది యుపీఎస్సీ పరీక్షలో ఆలిండియాలోనే 142వ ర్యాంక్ సాధించింది. అంతేనా ఆ రాష్ట్రం నుండి ఐఏఎస్‌గా నిలిచిన తొలి ముస్లిం మహిళగా తన పేరును చరిత్రలో నిలిచిపోయేలా లిఖించుకుంది. ఆమే ఆదిబా ఆనన్.
మహారాష్ట్రలోనే రైతు ఆత్మహత్యలకు పెట్టింది పేరుగా ఉండే విదర్భ ప్రాంతంలోని శుష్క అనే గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగింది ఆదిబా. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అష్ఫాక్ షేక్ (అదిబా తండ్రి) కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా పదవ తరగతిలోనే తన చదువు మానేయాల్సి వచ్చింది. తనకు చదువుకునే అవకాశం లేకపోయినా కనీసం కూతురునైనా బాగా చదివించాలని ఆ తండ్రి కలలు కన్నాడు. కలలు కనడం మాత్రమే కాదు ఆ వైపుగా బిడ్డను ప్రోత్సహించాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పగలూ రాత్రి ఆటో నడిపి ఆదిబాను చదివించాడు. ఆర్థిక సమస్యల వల్ల బిడ్డ చదువు మధ్య ఆగిపోకుండా చూడాలని తనకు తానే ప్రతిజ్ఞ చేసుకున్నాడు. బాల్యం నుండే తెలివైన విద్యార్థి అయిన ఆదిబాకు ఆయన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహాన్ని అందించాడు.
ఇంటర్ నుండే దృష్టి పెట్టి
అదిబాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉన్నారు. వారు కూడా అక్క అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. 10వ తరగతిలో 98 శాతం, 12వ తరగతిలో సైన్స్ విభాగంలో 97 శాతం మార్కులు సాధించిన తర్వాత పై చదువుల కోసం తన ప్రాంతమైన యావత్మల్‌ను విడిచిపెట్టి పూణేకు మకాం మార్చింది. అక్కడ ఆమె గణితంలో పట్టభద్రురాలైంది. ‘గ్రాడ్యుయేషన్ తర్వాత, చాలా మంది విద్యార్థులకు వారి భవిష్యత్తు గురించి స్పష్టత లేదు. కానీ నా దృష్టి 12వ తరగతి నుండి సివిల్ సర్వీస్ పరీక్షలపైనే ఉంది. నేను ఏమి కావాలనుకుంటున్నానో నాకు తెలుసు. దాని కోసం నేను చేయగలిగినంత కృషి చేశాను. సేవా ఎన్జీఓ కార్యదర్శిగా పనిచేస్తున్న మామయ్య నన్ను ఐఏఎస్ అధికారులకు పరిచయం చేశారు. ఇలా వారిని కలవడం నాకు ఎంతో ఆసక్తి కలిగింది. నేను కూడా ఐఏఎస్‌ను ఒక కలగా చేసుకున్నాను. దాన్ని కొనసాగించడానికి అవిశ్రాంతంగా కృషి చేశాను’ అని ఆమె ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.
ఒక సవాలుగా తీసుకొని
విజయానికి మార్గం ఎప్పుడూ సులభం కాదని ఆమె అంటుంది. దానికి చాలా అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతాయి. కానీ ఆమె తన ఐఏఎస్ కలను ఎలాగైనా నిజం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. ‘గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, నేను సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించాను. నా మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. కాస్త బాధపడ్డాను. కానీ ఎప్పుడూ నేను నా ఆశను కోల్పోలేదు. రెండవ ప్రయత్నంలో ఇంటర్వ్యూ దశకు చేరుకున్నాను. కానీ యూపీఎస్సీ తుది ఎంపిక జాబితాలో నా పేరు లేదు. అయితే నేను దాన్ని ఒక సవాలుగా తీసుకొని మరింత కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె గుర్తు చేసుకుంది.
అమ్మాయిలు చదువు దూరం
‘ముస్లింలకు చదువుకోవడం అంత సులభం కాదు, ముఖ్యంగా అడుగడుగునా పితృస్వామ్యాన్ని ఎదుర్కొనే అమ్మాయిలకు చదువుకోవడం అనేది మరింత కష్టమైన పని. కానీ నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. నాకు బలమైన మద్దతుగా, నాకు మూల స్థంబంగా నిలబడి ఉన్న నా తల్లికి నేను చాలా కృతజ్ఞురాలిని. మా కుటుంబాల్లో ఉన్నత చదువులు చదవడానికి అమ్మాయిలు పనికిరారు, కానీ నా తండ్రి సమాజం గురించి చింతించవద్దని, లక్ష్యంపై దృష్టి పెట్టాలని నాకు చెప్పారు. నా తల్లిదండ్రులు ఎదుర్కొన్న సామాజిక ఒత్తిడిని నన్ను ఎప్పుడూ తాకనివ్వలేదు’ అని ఆమె అన్నారు.
నిత్యం తపించేవారు
తాను చాలా నిరాడంబరమైన ఆర్థిక నేపథ్యం నుండి వచ్చానని అదిబా చెప్పారు. ‘ఆటో డ్రైవర్‌గా ఉండటం వల్ల నా చదువు ఖర్చులను భరించడం నాన్నకు కష్టంగా అనిపించింది. కానీ ఆర్థిక సమస్యల వల్ల తన పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకూడదని ఆయన నిత్యం తపించేవారు. సమస్యలు ఏవీ తన పిల్లలను ప్రభావితం చేయకూడదని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నా ప్రయాణం కష్టతరమైనదే, కానీ నా తల్లిదండ్రుల మద్దతు ఆ అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉంది’ అని ఆమె పంచుకున్నారు.
ఆశలు వదులుకోవద్దు
‘సమాజానికి సేవ చేయడానికి ఐఏఎస్ మొదటి అడుగు. నాకెంతో ఆసక్తి ఉన్న ఈ బాధ్యతల్లో పేదల కోసం, ముఖ్యంగా బాలికల కోసం పనిచేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. విద్య, ఆరోగ్య రంగానికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను’ అని ఆదిబా అంటుంది. సివిల్ సర్వీస్ ఆశించేవారు ఎప్పుడూ తమ ఆశలను వదులుకోవద్దని ఆమె సలహా ఇస్తూ, వైఫల్యాలు జీవితంలో ఒక భాగం కానీ వాటి నుండి నేర్చుకుని బలంగా ఎదగాలని ఆమె చెబుతుంది. ‘వైఫల్యాలు జీవితంలో ఒక భాగం. మనం మన తప్పుల నుండి నేర్చుకోవాలి. మరింత దిద్దుబాటు చర్యలతో కొత్త ప్రయత్నాలు చేయాలి’ అంటూ ముగించింది.
తొలి ముస్లిం మహిళా ఐఏఎస్ ఆదిబా
- Advertisement -