నవతెలంగాణ- హైదరాబాద్ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మరో ఘనత సాధించింది. బుధవారం అర్ధరాత్ర ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించిన ‘అగ్ని ప్రైమ్’ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఉదయం ప్రకటించారు.
2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రయోగాన్ని రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ వ్యవస్థ నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ విజయాన్ని భారత రక్షణ రంగంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అణు సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణికి 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సత్తా ఉంది.