నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రస్తుతం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పనితీరుపై ఆమె సమీక్షలు జరుపుతున్నారు. హైదర్‌గూడలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయం ఈ సమీక్షలకు వేదికైంది. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ భేటీలలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులతో ఆమె చర్చలు జరుపుతున్నారు. పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యలపై స్పందన వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
బుధవారం నాడు మీనాక్షి నటరాజన్ వివిధ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి స్థానాలపై దృష్టి సారించారు. ఈ సమావేశాలలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ఎమ్మెల్యేలతో పాటు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కూడా మీనాక్షి నటరాజన్ విడివిడిగా సమావేశమై చర్చించనున్నారు. ఈ విస్తృత స్థాయి సమీక్షల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసి, తదుపరి చర్యలకు రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది.