– ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, కూలీల, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఈ నెల 20న కార్మిక, రైతు, కూలీ సంఘాలు చేపట్టనున్న సమ్మె, గ్రామీణ బంద్‌కు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నదనీ, దేశానికి నవరత్నాలుగా భావించే సింగరేణి, రైల్వేలు, ఎల్‌ఐసీ, జీఐసీ, మైనింగ్, ఆయిల్, ఉక్కు తదితర విలువైన దేశ సంపదను వారికి కట్టబెడుతున్నదని విమర్శించారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం, అవి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నదని అన్నారు. దేశంలోని మహిళలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల వల్ల సామాన్యులు ఆకలి చావులకు గురువుతున్నారని తెలిపారు. బతుకు గ్యారెంటీ లేక యువత ఆత్మహత్యలు (ప్రభుత్వ హత్యలు) చేసుకుంటోందని వాపోయారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 26 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చటం దుర్మార్గమని విమర్శించారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును, సమస్యల పై ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నదని అన్నారు. యువతను అసాంఘీక కార్యకలాపాలకు పావులుగా మార్చే కుట్రలో భాగంగా మత, కుల, ప్రాంతీయ విభజనలు తెచ్చి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రతలేదనీ, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు. విద్యకు, వైద్యానికి, ఉపాధి హామీ పనులకు, మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వాలు నిధుల్లో కోత విధించాయని చెప్పారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలనీ, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని రైతులు చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి, సహాయ కార్యదర్శి కేఎన్ ఆశాలత పాల్గొన్నారు.
20న జరిగే సమ్మెకు ఐద్వా సంపూర్ణ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES