– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సహా పలువురి నివాళి
– బివి రాఘవులు, తమ్మినేని సంతాపం
– నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సీనియర్ నాయకులు సి అరుణ కన్నుమూశారు. మూడేండ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త సి సాంబిరెడ్డి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టీగా పనిచేశారు. వారి ఏకైక కుమారుడు సి అంజిరెడ్డి డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. అరుణ అంతిమయాత్ర శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
మహిళల హక్కుల కోసం ఉద్యమించిన అరుణ
అరుణ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఐద్వా హైదరాబాద్ నగర అధ్యక్షులుగా, కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. సుదీర్ఘకాలంగా నిర్వహించిన మహిళా ఉద్యమంతో ఆమె జీవితం పెనవేసుకుంది. మహిళల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు కన్వీనర్‌గా 20 ఏండ్లపాటు ఆమె సేవలందించారు. ఐద్వా నగర ఉద్యమంలో, బాగ్‌లింగంపల్లి చుట్టుపక్కల మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్న లక్ష్మి, కృష్ణకుమారి, ఎల్లమ్మను కలుపుకుని బాగ్‌లింగంపల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో అనేక ఉద్యమాలను చేపట్టారు. తద్వారా మహిళలను ఐద్వా వైపు ఆకర్షింపజేశారు. అనేక మంది కార్యకర్తలను తయారు చేశారు. ఐద్వా హైదరాబాద్ కార్యదర్శిగా టి జ్యోతి ఉన్నపుడు, అరుణ అధ్యక్షులుగా పనిచేశారు. జ్యోతి అధ్యక్షులుగా అయ్యాక అరుణ కార్యదర్శి అయ్యారు. హైదరాబాద్‌లో వారిద్దరూ మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆమె నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేశారు. కార్యకర్తలను కలుపుకుని ఉద్యమాల్లో భాగస్వాములను చేయడంలో ఆమె ముందువరుసలో ఉంటారు. అకౌంట్ నిర్వహణలో పకడ్బందీగా, పారదర్శకంగా వ్యవహరించేవారు. ఆమె నిరాడంబర జీవితం గడిపారు. మహిళల హక్కుల సాధన, వారిని చైతన్యం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు.
జాన్‌వెస్లీ సహా పలువురి నివాళి
అరుణ మరణవార్త తెలియగానే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె బాబురావు, సీనియర్ నాయకులు డిజి నరసింహారావు, జి రాములు, సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్, మాజీ కార్యదర్శి ఎం శ్రీనివాస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, పద్మశ్రీ, రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ తదితరులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. అరుణ మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె మరణం సీపీఐ(ఎం)కు, మహిళా ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఏపీ మాజీ కార్యదర్శి పి మధు సాంబిరెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. అరుణ మరణం పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అరుణ మరణం పట్ల సీపీఐ(ఎం) ఏపీ మాజీ కార్యదర్శి పెనుమల్లి మధు సంతాపం తెలిపారు.
పి ప్రభాకర్ సంతాపం
అరుణ మరణం పట్ల సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి కార్యదర్శి, నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. భర్త సాంబిరెడ్డి, ఆమె కమ్యూనిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో, అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. పేద ప్రజల పక్షాన, మహిళల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారని ఆమె సేవలను కొనియాడారు. ఆమె మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు, మహిళా ఉద్యమాలకు తీరనిలోటని తెలిపారు.
ఎస్వీకే సంతాపం
ఐద్వా సీనియర్ నాయకురాలు సి అరుణ మరణం పట్ల ఎస్వీకే మేనేజింగ్ కమిటీ, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరుణ, సాంబిరెడ్డి ఇద్దరూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు.

