నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు క్షీణించాయి. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యతలు నమోద్యాయి. దీంతో ఆ గాలి ప్రాణాంతకంగా మారుతుందని పలువురు నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో 80 శాతం నివాసితులు గాలి నాణ్యతలు క్షీణించడం వల్ల అనారోగ్యాలపాలవుతున్నారు. కనీసం కుటుంబంలో ఒక్కరైనా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. మాస్క్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు కొంత రక్షిస్తున్నప్పటికీ.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏడాది పొడవునా కచ్చితమైన విధాన మార్పు అవసరమని వైద్యులు సూచించారు.
కాగా, శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ఎక్యూఐ 370 స్థాయి వద్ద నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెరీపూర్ కేటగిరీలో వర్గీకరించింది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఎక్యూఐ తీవ్ర స్థాయిలో నమోదైంది. చాందినీ చౌక్, ఆనంద్ విహార్, ముండ్కా, బవానా, నరేలా, డిటియు- వజీర్‌పూర్‌లలో 400కి పైగా ఎక్యూఐ నమోదైంది. 18 పర్యవేక్షణా కేంద్రాల్లో 400 పైగానే ఎక్యూఐ నమోదైంది. గత కొన్ని రోజుల్లోనే కాకుండా.. వచ్చే వారంలో ఆరు రోజులు కూడా తీవ్ర ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యే అవకాశం ఉందని భూశాస్త్రాల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. గాలి కదలికలు సరిగ్గా లేకపోవడం, శీతాకాలం కారణంగా గాలి నాణ్యతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీలో గాలి ఎంత కాలుష్యంగా ఉందో నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలే నిదర్శనం.



