– నెల రోజుల పాటు 74 పశు వైద్యశాలల పరిధిలో టీకాలు
– అధికారికంగా చొల్లేరులో ప్రారంభం
– ప్రాంతీయ వైద్యశాల డాక్టర్లుతో సన్నద్ద సమావేశంలో డాక్టర్ జానయ్య
నవతెలంగాణ – భువనగిరి
పశువులకు సోకే ప్రధాన వ్యాధులలో గాలు కుంటి వ్యాధి ఒకటి సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. గాలికుంటు సోకిన పశువుల పాలు తాగిన దూడలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు 70శాతం టీకాలు అంటే 137200 డోసులు ఈ వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయనున్నారు.
4 నెలలు దాటిన ప్రతి పశువుకూ ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా వేయించాలని అధికారులు రైతులకు ఇప్పటికే సూచనలు చేశారు. 2021 పశు గణన లెక్కల ప్రకారం జిల్లాలో ఆవులు 67.144 లక్షలు, గేదెలు 1,07,444 వేలు ఉన్నాయి. వీటన్నిటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసేందుకు జిల్లా పశు సంవర్థకశాఖ సమాయత్తమైంది. దీనికోసం జిల్లాలో 17 మండలాల్లో 47 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి 74 పశు వైద్య శాలల పరిధిలో వేయనున్నారు.
వ్యాధి లక్షణాలు..
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను సులువుగా గుర్తించవచ్చు. పశువుల్లో తీవ్రమైన జ్వరం రావడంతో పాటు నీరసించిపోతాయి. నోటి నుంచి తీగల వలే చొంగ కారుతూ ఉంటుంది. కాలిగిట్టలు, నోటి వద్ద పుండ్లు ఏర్పడతాయి. కొద్దిపాటి ఎండకు ఇవి తట్టుకోలేవు. చూడి పశువులు అయితే ఈనుకుపోతుంది. వీటి పాలు తాగే దూడలు మరణిస్తాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పశువుల పని సామర్థ్యం అంతేస్థాయిలో తగ్గుతుంది. దీనివల్ల పాడి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోతాయి. అందుకే టీకా వేయించుకోవాలి.
టీకాల వల్ల లాభాలు..
నాలుగు నెలల వయసు దాటిన పశువులు, జీవాలకు ముందు జాగ్రత్త చర్యగా టీకా వేయించాలి. ఆవులు, గేదెలకు 2 మిల్లీ లీటర్ల చొప్పున టీకా ఇవ్వాలి. ఆరు నెలలకు ఒకసారి టీకా వేయిస్తే గాలి కుంటు వ్యాధి దరి చేరదు. ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది. దీనివల్ల పాడి రైతుకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. పని సామర్థ్యం తగ్గకుండా కాపాడవచ్చు. దూడల్లో మరణాలు సంభవించవు. అవి ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
పకడ్బందిగా నిర్వహించాలి
– డాక్టర్ పి. జానయ్య, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి
జిల్లా వ్యాప్తంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ పి. జానయ్య అన్నారు. మంగళవారం పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ప్రాతీయ పశు వైద్య శాఖ డాక్టర్లుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 తేదిన గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్ట మండలం చోల్లేరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి అధికారికంగా ప్రారంభించడం కోసం సన్నద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాతాల్లో టీకాల ప్రారంబోత్సవాలు చేయాలన్నారు.