Friday, July 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంPlane Crash : కుప్పకూలిన ఎయిర్‌లైన్‌ విమానం...

Plane Crash : కుప్పకూలిన ఎయిర్‌లైన్‌ విమానం…

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: రష్యాలో విమాన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 49 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం అమూర్‌ ప్రాంతంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా.. కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు నిర్ధరించారు.

అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్‌-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను సిద్ధం చేశారు. విమానం కోసం గాలించగా.. గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు.

ఘటనా స్థలంలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. పరిస్థితులు అనుకూలించలేదట. రెండోసారి ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. రాడార్‌ నుంచి గల్లంతై కూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు రష్యన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

విమానం కూలిన ప్రాంతంలో శకలాలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని రష్యా అధికారిక మీడియా ఛానల్‌ ప్రకటించింది. ల్యాండింగ్‌ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం, పైలట్‌ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -