Tuesday, April 29, 2025
HomeUncategorizedవిమానయానం ప్రియం..!

విమానయానం ప్రియం..!

– అంతర్జాతీయ రూట్లలో 12 శాతం చార్జిల పెంపు
– పాకిస్తాన్‌ గగనతలం మూసివేత ప్రభావం
– డీజీసీఏ కీలక సూచనలు
న్యూఢిల్లీ :
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారిపై మరింత భారం పెరగనుంది. పహెల్గాం ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌ ఆ దేశ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత్‌లో రిజిస్టర్‌ అయిన అన్ని విమానాలతోపాటు ఇక్కడి యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్‌ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. యూరప్‌, అమెరికా, మిడిల్‌ఈస్ట్‌ తదితర దేశాలకు పాక్‌ గగనతలంపై నుంచి భారత విమాన సర్వీసులు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో చుట్టూ తిరిగి ప్రయాణించడంతో వ్యయాలు పెరిగాయి. ఆయా భారాన్ని ప్రయాణికులపై మోపాలని విమాన సంస్థలు నిర్ణయించాయి. దాదాపు 8 శాతం నుంచి 12 శాతం వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. భారత్‌ నుంచి ఉత్తర అమెరికా, బ్రిటన్‌, యూరప్‌ తదితర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల సమయం మరింత పెరిగిందని ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, ఇండిగో లాంటి సంస్థలు తమ ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నాయి. అమెరికా, యూరోపియన్‌ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణ సమయం 2 గంటల నుంచి 2.5 గంటల వరకు పెరగిందని ఓ పైలట్‌ తెలిపారు. దీంతో చమురు, నిర్వహణ వ్యయం పెరగడంతో విమాన ఛార్జీలను పెంచాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయన్నారు.
ఢిల్లీ, అమృత్‌సర్‌, జైపూర్‌, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచ్చించడంతో పాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోందని విమానయాన సంస్థల వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్‌ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. ఇది కూడా ప్రయాణిలపై భారం పెంచనుంది. కాగా.. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్‌ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. బాలాకోట్‌ వైమానిక దాడుల నేపథ్యంలో 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది.
డీజీసీఏ అడ్వైజరీ..
భారత విమానాలపై పాక్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) విమానయాన సంస్థలకు పలు సూచనలు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ప్రయాణ సమయం పెరగనున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు పలు అడ్వైజరీలు జారీ చేసింది. విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలని సూచించింది. విమానాల్లో ప్రయాణికులకు భోజనం, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం, కస్టమర్‌కేర్‌ సర్వీసులతో సహా ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img