నవతెలంగాణ – హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటి ఐశ్వర్య లక్ష్మి తన అభిమానులకు షాక్ ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు ఆమె ప్రకటించారు. తన మానసిక ప్రశాంతతకు, వృత్తికి ఇది ఆటంకంగా మారిందని వివరిస్తూ ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి అని తొలుత భావించానని ఐశ్వర్య తెలిపారు. కానీ, అది తన పనికి ఆటంకం కలిగించడమే కాకుండా, తన ఆలోచనలను దోచుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “చిన్న చిన్న సంతోషాలను కూడా ఇది దుఃఖంగా మార్చేసింది. అంతర్జాలం సృష్టించే ఊహలకు, అంచనాలకు అనుగుణంగా జీవించడం ఒక మహిళగా నాకు చాలా కష్టంగా మారింది” అని ఆమె తన నోట్‌లో పేర్కొన్నారు. ఒక కళాకారిణిగా తనలోని అమాయకత్వాన్ని, వాస్తవికతను కాపాడుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. “సోషల్ మీడియా లేని వారిని ఈ రోజుల్లో జనాలు మర్చిపోతారని తెలుసు. అయినా ఆ సాహసానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాలోని నటిని బతికించుకోవడానికే ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నాను” అని ఆమె వివరించారు. ఈ నిర్ణయం తన జీవితంలో బలమైన బంధాలను ఏర్పరుస్తుందని, మరిన్ని మంచి చిత్రాలలో నటించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనను ప్రేమగా గుర్తుంచుకోవాలని అభిమానులను కోరారు.