నవతెలంగాణ-హైదరాబాద్: మిత్ర దేశమంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై సుంకాల మోత మోగిస్తున్నారు. 25శాతంతో పాటు అదనంగా పెనాల్టీ విధించున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య పరంగా అయోమయం నెలకొంది. ఈక్రమంలో కేంద్రం ప్రభుత్వం అన్యూహ నిర్ణయం తీసుకుంది.
రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రష్యాకు పంపించింది. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అజిత్ దోవల్ రష్యా పర్యటన ముందుగానే ఖరారైంది. అయితే, రష్యాతో భారత్ సంబంధాల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల తరుణంలో అజిత్ దోవల్ పర్యటన చర్చకు దారి తీసింది.
అజిత్ దోవల్ తన పర్యటనలో భాగంగా రష్యాతో వ్యూహాత్మక ఒప్పందం,రక్షణ సంబంధిత ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ కథనాల్ని వెలువరించింది. అదే సమయంలో భారత రాయబారి వినయ్ కుమార్, రష్యా డిప్యూటీ రక్షణ మంత్రి కల్నల్-జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్ మధ్య మాస్కోలో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి భారత్-రష్యాలు తమ నిబద్ధతను చాటిచెప్పాయి.