22, 23, 24 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా :
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
నవతెలంగాణ-నల్లగొండటౌన్
చేనేత భరోసాను జియో ట్యాగ్ కలిగిన అందరికీ ఇవ్వాలని, ఎలాంటి షరతులూ లేకుండా రుణమాఫీ చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 22, 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలన్నారు. చేనేత కార్మికులకు, అనుబంధ వృత్తుల కార్మికులందరికీ చేనేత భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కేంద్రాల్లో సబ్సిడీతో నూలు డిపోలు ఏర్పాటు చేసి కార్మికులకు అందించాలని కోరారు. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు, ఇండ్లు లేని పేదలకు 120 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల, సహకార సంఘాలలో ఉన్న వస్త్రాల నిల్వలను కొనుగోలు చేయాలన్నారు. 12 సంవత్సరాలుగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిర్వీర్యమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు 8 గంటల పనిదినాలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంజి నాగరాజు, దండెంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, నర్సింగ్‌బట్ల, చేనేత సహకార సంఘం అధ్యక్షులు జెల్లా నరసింహ, జిల్లా సహాయ కార్యదర్శి చెరుకు సైదులు, కర్నాటి శ్రీరంగం ఉన్నారు.
అందరికీ చేనేత భరోసా ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES