నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ ఇ – కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. హ్యూమన్ రీసోర్స్ (హెచ్‌ఆర్) విభాగం నుండి 15శాతం సిబ్బందిని తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. హెచ్‌ఆర్ యూనిట్‌పై తీవ్రంగా ప్రభావం పడనుందని, అయితే ఇతర విభాగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఫార్చ్యూన్ ఉదహరించిన పలు వర్గాలు తెలిపాయి. ఇటీవల కంపెనీ కన్స్యూమర్ డివైసెస్ గ్రూప్, వండరీ పాడ్‌కాస్ట్ విభాగం మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి కొద్దిమంది ఉద్యోగులను తొలగించిన కొన్ని నెలల అనంతరం ఈ చర్య వచ్చింది. అయితే సంస్థ ఎప్పుడు, ఎంత మంది ఉద్యోగులను తొలగించనుంది అన్న వివరాలపై స్పష్టత లేదు.
ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) కోసం అమెజాన్ వందకోట్లకు పైగా ఖర్చు చేయడంతో ఈ తొలగింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కంపెనీ 100 బిలియన్ డాలర్లకు పైగా మూలధన పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు ప్రకటించింది. దీనిలో అత్యధిక భాగం ఎఐ మౌలిక సదుపాయాల కోసం వినియోగించనుంది.