నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. విదేశీ పెట్టుబడులతో నడిచే ప్రైవేట్ సంస్థల ఆధిపత్యానికి చెక్ పెడుతూ, దేశంలోనే తొలిసారిగా సహకార రంగం ఆధ్వర్యంలో నడిచే ‘భారత్ ట్యాక్సీ’ ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రెండు నెలల విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్ అనంతరం, ప్రస్తుతం ఈ సేవలను ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్ రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చారు. రానున్న రెండేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తామని అమిత్ షా ప్రకటించారు. ‘మూడేళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు.



