నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం'(AMMK) చీఫ్ టీటీవీ దినకరన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా.. బుధవారం ఏఎమ్ఎమ్‌కే చీఫ్ టీటీవీ దినకరన్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన కూటమి కండువా కప్పుకున్నారు.
ఎన్డీయేలో చేరడంపై దినకరన్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు, సుపరిపాలన కోసం పాత విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. తమిళనాడు అభివృద్ధి, సంక్షేమం, పార్టీ ఉనికి కోసం కొన్ని సమయాల్లో రాజీపడటం బలహీనత కాదని.. అది ఉమ్మడి ప్రయోజనాల కోసమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ ‘అమ్మ పాలన’ను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని గుర్తు చేశారు. జనవరి 23న చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు దినకరన్ హాజరై తన బలాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం.



