Magazines

జాబ్‌లెస్‌ యూత్‌

6 గంటల క్రితం

Jobless youth
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 4 నిమిషాల చదవడం

ప్రపంచ వ్యాప్తంగా పాలకులకు పెనుసవాల్‌
ఉద్యోగాల కంటే యువత పెరుగుదలే అధికం
120 కోట్ల మంది యువతకు పని అవసరం.. దక్కేది 40 కోట్ల ఉద్యోగాలే
భారత్‌లోనూ ఉపాధి కల్పన
మారకపోతే సామాజిక అస్థిరత తప్పదు
ప్రపంచ బ్యాంకు అంచనాలు.. హెచ్చరిస్తున్న నిపుణులు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కనిపించని పెను సంక్షోభం ముంచుకొస్తోంది. వచ్చే పదేండ్లలో ప్రపంచ దక్షిణ దేశాల్లో సుమారు 120 కోట్ల మంది యువత పని చేసే వయసుకు చేరుకోనున్నారు. అయితే అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సృష్టించగల ఉద్యోగాలు 40 కోట్లకు మించకపోవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. అంటే దాదాపు 80 కోట్ల మందికి తగిన ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడనుంది. జనాభా పెరుగుదల ఆర్థిక అభివృద్ధికి వరంగా మారాల్సిన చోట.. నిరుద్యోగం, పేదరికం, వలసలు, సామాజిక అస్థిరతకు కారణమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
న్యూఢిల్లీ : యువత అధికంగా ఉండటం ఒక దేశానికి ఆర్థికంగా గొప్ప అవకాశంగా భావిస్తారు. పనిచేసే వయసులో ఉన్నవారి సంఖ్య పెరిగితే ఉత్పత్తి, పొదుపు, పెట్టుబడులు పెరిగి దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారవుతోంది. యువత సంఖ్య పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఉద్యోగాలు పెరగడం లేదు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా చేసిన హెచ్చరిక ప్రకారం.. రాబోయే పదేండ్లలో ప్రపంచ దక్షిణ దేశాల్లో 120 కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించనుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సృష్టించగల ఉద్యోగాలు 40 కోట్ల వరకు మాత్రమే ఉండొచ్చు. దీంతో 80 కోట్ల ఉపాధి అవకాశాల లోటు ఏర్పడే ప్రమాదం ఉంది.

జనాభా వరం..
సంక్షోభంగా మారే ప్రమాదం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ‘జనాభా ప్రయోజనం’ ఆర్థిక పురోగతికి ప్రధాన బలంగా భావిస్తున్నారు. జననాల రేటు తగ్గి, పనిచేసే వయసు వారితో పోలిస్తే పిల్లలు, వృద్ధుల సంఖ్య తగ్గినప్పుడు దేశానికి అధిక ఉత్పాదకత, పొదుపు, పెట్టుబడులకు అవకాశం లభిస్తుంది. తూర్పు ఆసియా దేశాల ఆర్థిక విజయానికి ఇదే ఒక కారణంగా నిలిచింది. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భారత్‌ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత సంఖ్య వేగంగా పెరుగుతున్నా.. వారికి తగిన ఉద్యోగాలు కల్పించే స్థాయిలో మార్కెట్లు, మౌలిక వసతులు, సంస్థాగత వ్యవస్థలు అభివృద్ధి చెందడం లేదు. దీంతో జనాభా ప్రయోజనం కాస్తా నిరుద్యోగ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది.
పరిశ్రమల్లో ఉద్యోగాలకు కోత
గతంలో పేద దేశాలు వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు మారే సమయంలో తక్కువ నైపుణ్యం ఉన్న లక్షలాది మంది కార్మికులకు తయారీ రంగం ఉద్యోగాలు కల్పించేది. అయితే ఇప్పుడు యంత్రాలు, రోబోలు, ఆధునిక సాంకేతికత కారణంగా తయారీ రంగంలో మానవ శ్రమ అవసరం తగ్గుతోంది. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తగిన ఆదాయ స్థాయికి చేరకముందే పరిశ్రమల్లో ఉద్యోగాలు తగ్గి పోతున్నాయి. అలాగే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అధిక నైపుణ్యం, డిజిటల్‌ పరిజ్ఞానం ఉన్నవారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. నాణ్యమైన విద్య, వృత్తి శిక్షణ, డిజిటల్‌ సదుపాయాలు అందుబాటులో లేని కోట్లాది మంది యువత ఉద్యోగ పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారు.

చిన్న, మధ్య తరహా సంస్థలకు ఊతమివ్వాలి
ఉద్యోగాల సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు మరింత అవకాశాలు కల్పించాలని ప్రపంచ బ్యాంకు సూచిస్తోంది. అధిక వడ్డీ రేట్లు, సంక్లిష్టమైన నిబంధనలు, అనిశ్చిత ప్రభుత్వ విధానాలు, అధిక పన్నులు కొత్త వ్యాపారాల ఏర్పాటుకు అడ్డంకులుగా మారుతున్నాయి. నిబంధనలను సరళీకరించడం, పారదర్శక పాలన, బలమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. చిన్న, మధ్య తరహా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగలవు. మౌలిక వసతుల అభివృద్ధి కూడా కీలకమే. విద్యుత్‌ అంతరాయాలు, అధిక రవాణా ఖర్చులు, అధ్వాన్నమైన రహదారులు, నౌకాశ్రయాల్లో జాప్యాలు వ్యాపారాల వృద్ధికి అడ్డంకులుగా ఉన్నాయి. మౌలిక వసతుల నిర్మాణం తక్షణమే ఉద్యోగాలను కల్పించడమే కాకుండా.. తర్వాత వ్యాపార నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తుంది.

రంగాలవారీగా ఉపాధి వ్యూహాలు
వ్యవసాయాన్ని ఆధునికీకరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చు. అధిక దిగుబడి పంటలు, వ్యవసాయ సాంకేతికత, శీతల గిడ్డంగులు, ఆహార ప్రాసెసింగ్‌, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు పెట్టుబడులు పెంచాలి. దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే మెరుగైన ఉపాధి లభిస్తుంది. నగరాలకు వలస వెళ్లే పరిస్థితి తగ్గుతుంది. ఆరోగ్య, సంరక్షణ రంగాలు కూడా పెద్దఎత్తున ఉద్యోగాలను సృష్టించగలవు. వైద్య సిబ్బంది, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధుల సంరక్షణ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా యువతులతో పాటు మహిళలకు ఈ రంగాలు పెద్దఎత్తున ఉపాధి కల్పించగలవు. పర్యాటకం, సాంస్కృతిక రంగాలు కూడా తక్కువ నైపుణ్యం ఉన్నవారికి ఉపాధి కల్పించే అవకాశాలను కలిగి ఉన్నాయి. రవాణా, వసతి, హస్తకళలు, స్థానిక సేవలతో అనేక వర్గాలకు ఆదాయం లభిస్తుంది. తయారీ రంగంలోనూ కొత్త అవకాశాలను అన్వేషించాలి. సౌర పరికరాలు, విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు, ఇంధన పొదుపు పరికరాల తయారీ వంటి హరిత పరిశ్రమలను అభివృద్ధి చేయడంతో పాటు.. అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలి.

భారత్‌కు అతి పెద్ద సమస్య
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ ఈ సంక్షోభానికి కేంద్రంగా ఉంది. ప్రతి ఏడాది లక్షలాది మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. కానీ అదే స్థాయిలో ఉద్యోగాలు మాత్రం పెరగడం లేదు. నైపుణ్యాలు–ఉద్యోగ మార్కెట్‌ మధ్య అంతరం, పాక్షిక ఉపాధి, మహిళల తక్కువ ఉద్యోగ భాగస్వామ్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వ్యవసాయం ఇప్పటికీ దేశంలో దాదాపు సగం మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ.. దేశ స్థూల దేశీయోత్పత్తిలో దాని వాటా 2023–24లో సుమారు 16 శాతమే. 30 ఏండ్లలోపు సగటు వయసు ఉన్న భారత్‌కు ఇది కీలక దశ. యువ జనాభాను ఉత్పాదక శక్తిగా మార్చగలిగితే అది గొప్ప ఆర్థిక అవకాశంగా మారుతుంది. లేకపోతే నిరుద్యోగం, అసంతృప్తి, వలసలు, సామాజిక ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఉపాధి సంక్షోభం కొనసాగితే వలసలు అనివార్యం
ఉద్యోగాలు లేకపోవడం వల్ల యువతలో ప్రభుత్వాలపై నమ్మకం తగ్గి, సామాజిక విభజనలు పెరిగి, నేరాలు, తీవ్రవాద భావజాలాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్తు న్నారు. ప్రపంచ దక్షిణ దేశాల్లో ఉపాధి సంక్షోభం కొనసాగితే.. మెరుగైన జీవనో పాధి కోసం అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు కూడా పెర గవచ్చని అంటు న్నారు. అందుకే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ఆర్థిక సహాయం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ అందించాలని సూచిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా పాలనా సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పించే పరిశ్రమలపై దృష్టి పెట్టాలనీ, యువతకు పని, గౌరవప్రదమైన జీవితం కల్పించ డంలో ప్రపంచం విఫల మైతే.. 21వ శతాబ్దపు జనాభా ప్రయో జనం ప్రపంచవ్యాప్త సంక్షో భంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్