ఆటోమేటిక్ వర్క్పర్మిట్ పొడిగింపు నిలిపివేత
వాషింగ్టన్ : వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొందరు ప్రత్యేక వలసదారులకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపును నిలిపివేసింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కొత్త నిబంధనలు జారీ చేసింది .
అమెరికాలో కొందరు ప్రత్యేక వలసదారులకు ఉపాధి అనుమతి పత్రాల గడువు ముగిసిన తర్వాత వారి దరఖాస్తులు పెండింగ్లో ఉంటే.. 540 రోజుల పాటు ‘ఆటోమెటిక్ పొడిగింపు’ ఉండేది. యూఎస్సీఐఎస్ లో దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం వల్ల వలస ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోకుండా ఉండేలా ఇంతకాలం ఈ పొడిగింపు అమల్లో ఉంది . అయితే, భద్రతా సమీక్షలు, వలసదారుల అర్హతలను సమగ్రంగా తనిఖీ చేసేందుకు ఇప్పుడు దానిని శాశ్వతంగా రద్దు చేసేలా ట్రంప్ సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, శరణార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. గతేడాది అక్టోబర్ 30, ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు సమర్పించిన వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. విదేశీ ఉద్యోగులు తమ ప్రస్తుత వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి 180 రోజులకు ముందు మాత్రమే రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ కొత్త నిబంధనలతో విదేశీ వర్కర్లు ఉపాధి కోల్పోవడంతో పాటు కంపెనీల ఉత్పాదకత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోపు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని, ప్రాసెసింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఈ ‘180 రోజులు’ నిబంధన తీవ్ర అడ్డంకిగా మారింది.
లక్షల్లో దరఖాస్తులు
యూఎస్సీఐఎస్ వద్ద ఆరు నెలలుగా వర్క్ పర్మిట్ పునరుద్ధరణ కోసం లక్షల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. జూన్ 30,2026 నాటికి ఆ సంఖ్య 4.32 లక్షలు దాటింది. ఇక, ఆటోమేటిక్ పొడిగింపు రద్దు చేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉండగా.. వాటి పట్ల తొలినుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హెచ్-4 వీసాదారులు కొందరు జనవరిలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీపై కోర్టులో దావా వేశారు. దాంతో కాలిఫోర్నియా కోర్టులో వారికి స్వల్ప ఊరట లభించింది. డీహెచ్ఎస్ విధానపరమైన నిబంధనలు పాటించలేదని పేర్కొంది.






కామెంట్లు (0)