Magazines

రియాద్‌పై దాడులు..15 వరకు విమానాల రద్దు

1 గంట క్రితం

riyad air port
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని విమానాశ్రయంపై హౌతీ రెబల్స్ నిరంతరం దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి తిరిగి వచ్చే విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు దాడులను ఉద్ధృతం చేయడంతో భద్రతా కారణాల దృష్ట్యా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎయిర్ ఇండియాతో పాటు ఇతర భారత విమానయాన సంస్థలు సైతం సౌదీ అరేబియాకు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇండిగో సంస్థ రియాద్, దమ్మామ్‌ విమానాలను అక్టోబర్ 15 వరకు రద్దు చేసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం దమ్మామ్, జెడ్డాలకు అక్టోబర్ 12 వరకు, రియాద్‌కు అక్టోబర్ 15 వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆకాశ ఎయిర్ సంస్థ జెడ్డా, రియాద్‌లకు అక్టోబర్ 13 వరకు విమాన సర్వీసులను రద్దు చేసింది.

గత వారం రోజులుగా సౌదీలోని విమానాశ్రయాలు, ఇంధన వనరులపై హౌతీ రెబల్స్ దాడులను తీవ్రతరం చేశారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా సౌదీ అధికారులు రియాద్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో పాటు గగనతలంలో ఆంక్షలు విధించారు. ఈ ఉద్రిక్తతల కారణంగా భారత్, సౌదీ అరేబియా మధ్య విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రతకే అత్యున్నత ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్