Magazines

దిగజారిన ట్రంప్‌ రేటింగ్‌

45 నిమిషాల క్రితం

Trump's
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

రిపబ్లికన్‌ పార్టీకి దూరమవుతున్న హిస్పానిక్‌లు
పెరుగుతున్న జీవనవ్యయంపై అమెరికన్ల ఆగ్రహం
రాయిటర్స్‌/ఇప్సోస్‌ తాజా సర్వే వెల్లడి


వాషింగ్టన్‌ : మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోతోంది. ఆయన పనితీరును హిస్పానిక్‌లు (అమెరికాలో నివసించే, స్పానిష్‌ భాష మాట్లాడే లాటిన్‌ అమెరికన్‌ సంతతికి చెందిన వారు) తీవ్రంగా విమర్శిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీని వ్యతిరేకించాలని మెజారిటీ హిస్పానిక్‌లు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్‌ ఆమోద రేటింగ్‌ కనిష్ట స్థాయికి చేరుకుంది. రాయిటర్స్‌/ఇప్సోస్‌ ఆరు రోజుల పాటు జరిపిన పోల్‌ సోమవారం ముగిసింది. ఈ పోల్‌లో కేవలం 32 శాతం మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్‌కు మద్దతు తెలిపారు. గత నెలలో జరిగిన పోల్‌లో కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.


పనితీరుపై పెదవివిరుపు
2020 అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌కు మూడింట ఒక వంతు హిస్పానిక్‌లు ఓటు వేశారు. 2024 ఎన్నికలలో ఆయన దాదాపుగా సగం మంది హిస్పానిక్‌ల ఓట్లు సాధించడంతో విజయం సాధించగలిగారు. అయితే ఇరాన్‌పై యుద్ధం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో అధ్యక్షుడికి ప్రజామోదం రోజురోజుకూ తగ్గిపోతోంది. అధ్యక్షభవనంలో ట్రంప్‌ పనితీరును ఇప్పుడు కేవలం 24 శాతం హిస్పానిక్‌లు మాత్రమే సమర్ధిస్తున్నారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత హిస్పానిక్‌లలో ఆయన రేటింగ్‌ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. ఇది రిపబ్లికన్‌ అభ్యర్థుల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.


డెమొక్రాట్లకే స్వతంత్ర ఓటర్ల మద్దతు
తాజా పోల్‌లో డెమొక్రాట్లను 44 శాతం మంది, రిపబ్లికన్లను 37 శాతం మంది సమర్ధించారు. స్వతంత్రులలో కూడా 37 శాతం మంది డెమొక్రాట్లను సమర్ధిస్తుండగా 21 శాతం మందే రిపబ్లికన్ల వెంట ఉన్నారు. స్వతంత్రులలో 28 శాతం మంది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ట్రంప్‌ పదవీకాలంలోని చివరి రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై నియంత్రణ ఎవరిదనే విషయాన్ని నిర్ణయించే ఈ ఎన్నికలలో కేవలం 26 శాతం మంది హిస్పానిక్‌ ఓటర్లు మాత్రమే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధిస్తున్నారు. హిస్పానిక్‌ ఓటర్లలో 52 శాతం మంది డెమొక్రటిక్‌ అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నారు. ఇది హిస్పానిక్‌లలో రిపబ్లికన్లకు ఉన్న మద్దతు కంటే రెట్టింపు కాగా ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డెమొక్రాట్లకు ఇదే అతి పెద్ద ఆధిక్యత.


కీలకం కాబోతున్న 'జీవనవ్యయం'

ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు మెజారిటీ సాధిస్తారని, సెనెట్‌పై కూడా నియంత్రణ సాధించే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేశారు. మధ్యంతర ఎన్నికలలో 'జీవనవ్యయం' కీలక అంశం కాబోతోందని తాజా పోల్‌ తెలిపింది. ఇరాన్‌పై ట్రంప్‌ సాగించిన యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఫలితంగా వినియోగదారుల ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. కాగా 50 సంవత్సరాలకు పైబడిన వారిలో మాత్రం రిపబ్లికన్‌ పార్టీ వైపు స్వల్పంగా మొగ్గు కన్పిస్తోంది. ఈ వయసు వారిలో 44 శాతం మంది రిపబ్లికన్‌ పార్టీని, 42 శాతం మంది డెమొక్రటిక్‌ పార్టీని సమర్ధిస్తున్నారు. అయితే 50 సంవత్సరాల లోపు వయసున్న వారిలో డెమొక్రాట్లకు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఈ వయసు వారిలో రిపబ్లికన్ల కంటే వీరికి 18 పాయింట్ల ఆధిక్యత ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్