Magazines

చమురు భారమే

50 నిమిషాల క్రితం

oil
avatar
balaji

ప్రచురించబడింది నవం 02, 2026 | 2 నిమిషాల చదవడం

పరిస్థితులు ఆశాజనకంగా లేవు

అమెరికా మిడ్‌టర్మ్‌ తర్వాత కూడా సవాళ్లే

భారత్‌పైనా తీవ్ర ప్రభావం : ఎంకే గ్లోబల్‌ వెల్లడి


న్యూయార్క్‌ : అంతర్జాతీయంగా ముడి చమురు విషయంలో ఇప్పట్లో పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకం లేవనీ, అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత కూడా ఇవే సవాళ్లు కొనసాగుతాయని ‘ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్’ అనే ఆర్థిక సేవల సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ గెలిచినా కూడా, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే విదేశాంగ నిర్ణయాలను వారు పెద్దగా అడ్డుకోలేరని పేర్కొంది. అలాగే ఇరాన్‌తో అమెరికా సంఘర్షణ మరింత తీవ్రతరం కావొచ్చని అంచనా వేసింది. అందువల్ల అమెరికా మిడ్‌ టర్మ్‌ పోల్స్‌ ముగిసిన తర్వాత కూడా భారత్‌పై అంతర్జాతీయంగా ముడిచమురు ధరల భారం, ఆర్థిక ఒత్తిళ్లు తప్పకపోవచ్చని తెలిపింది. అలాగే ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమైతే చమురు ధరలు మరింత పెరిగి, అది భారతదేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీఓపీ), విదేశీ మారక ద్రవ్య మార్కెట్, ఈక్విటీలపై ఒత్తిడిని పెంచుతుందని వెల్లడించింది.


దేశీయ మార్కెట్లకు డాలర్ విలువ, యూఎస్‌ బాండ్ ఈల్డ్స్ (బాండ్ల రాబడి), అంతర్జాతీయ రిస్క్ అపెటైట్ (పెట్టుబడుల పట్ల ఆసక్తి), ముడి చమురు ధరలే కీలకమైన అంశాలుగా కొనసాగుతాయని, డెమోక్రాట్లు యూఎస్ ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధిస్తారని, అలాగే సెనేట్‌లో మెజారిటీ సాధించడానికి కూడా వారికి అవకాశాలు మెరుగుపడ్డాయని ఆ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. డెమోక్రాట్లు ఉభయ సభలను గెలుచుకునే అవకాశం 60 శాతం ఉందని పేర్కొంది. రిపబ్లికన్లు సెనేట్‌ను నిలుపుకునే అవకాశం 30 శాతం మాత్రమే ఉందని తెలిపింది. అలాగే ఉభయ సభల్లో పట్టు సాధించడానికి రిపబ్లికన్లకు 10 శాతం మాత్రమే అవకాశం ఉందని పేర్కొంది.

మిడ్‌ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ సెనేట్,

యూఎస్ ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధిస్తే ట్రంప్ విధించే సుంకాలు, వలస విధానాలపై పర్యవేక్షణ మరింత పెరిగే అవకాశం ఉందని ఎంకే గ్లోబల్‌ పేర్కొంది. రాజకీయ ప్రతిష్టంభన కారణంగా అమెరికా ఈక్విటీలలో వెంటనే స్థిరమైన ర్యాలీ వస్తుందని ఆశించలేమని హెచ్చరించింది. సాధారణంగా మధ్యంతర ఎన్నికల తర్వాత 60 ట్రేడింగ్ రోజులలో ఎస్‌అండ్‌పీ 500 సూచీ దాదాపు 6 శాతం లాభపడిన చరిత్ర ఉన్నప్పటికీ, అయితే ప్రస్తుత పరిస్థితులు స్టాక్ మార్కెట్‌కు అంత అనుకూలంగా లేవని వెల్లడించింది. గత ఆర్నెళ్లలో ఈక్విటీలు సుమారు 12 శాతం పెరిగాయని చెప్పింది. యూఎస్ బాండ్ల రాబడులు అధికంగా ఉన్నాయని, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 61 శాతం పెరిగాయని తెలిపింది.

భారత మార్కెట్ల జోష్ తాత్కాలికమే!

డాలర్ విలువ, అమెరికా బాండ్ల ఆదాయం, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దేశీయ (భారత) మార్కెట్లకు ఊతం లభిస్తుందని అంచనా వేసిన ఎంకే గ్లోబల్.. శాంతి డివిడెండ్ (యుద్ధాలు, ఉద్రిక్తతలు ముగియడం వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనం) అంత త్వరగా వచ్చేలా కనిపించడం లేదని అభిప్రాయపడింది.

అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత భారత మార్కెట్లలో కనిపించే ఆశావాదం తాత్కాలికమే కావొచ్చని పేర్కొంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్