ఓటర్ల జాబితా నుంచి వారిని తొలగించండి : రాష్ట్రాలకు ట్రంప్ ప్రభుత్వం లేఖలు...అడ్డుకున్న న్యాయస్థానం
వాషింగ్టన్ : మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అందులో భాగం గానే... ఓటర్లు జాబితాలో అమెరికా పౌరులు కాని వారి పేర్లు ఉన్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా అనేక రాష్ట్రాలకు వారి సమాచారాన్ని పంపింది. తద్వారా వారు ఎన్నికల్లో ఓటు వేయకుండా నిరోధించేందుకు ప్రయత్ని స్తోంది. పౌరసత్వం లేని ఓటర్ల రిజిస్ట్రేషన్, ఓటింగును అడ్డుకోవడానికి రాష్ట్రాలకు ప్రభుత్వం రాసిన లేఖలు అమెరికా రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఓటర్ల జాబితాలో ఇరవై వేల మందికి అమెరికా పౌరసత్వం లేదని ప్రభుత్వం ఆరోపించింది. అదే విధంగా వాషింగ్టన్ రాష్ట్రంలో అమెరికా పౌరసత్వం లేని నాలుగు వందల మంది ఓటర్లు గత ఎన్నికల్లో పదిహేను వందల సార్లు ఓటు వేశారని తెలిపింది. పౌరసత్వం లేని వారుగా తాను గుర్తించిన వారి బ్యాలెట్లను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తూ న్యాయ శాఖ కాలిఫోర్నియా, వాషింగ్టన్ సహా పలు రాష్ట్రాలకు లేఖలు పంపింది.
ఎన్నికలు ముగిసే వరకూ దర్యాప్తులు వద్దు
ట్రంప్ ప్రభుత్వ హెచ్చరికలను వాషింగ్టన్, కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలు బేఖాతరు చేశాయి. ట్రంప్ ప్రభుత్వం ఉపయోగించిన హోమ్‌లాండ్ సెక్యూరిటీ డేటా బేస్‌లలో తీవ్ర లోపాలు ఉన్నాయని అవి ఎత్తిచూపాయి. గతంలో నెవాడా రాష్ట్రంలో పదిహేను వేల మందికి పౌరసత్వం లేదని ప్రభుత్వం ఆరోపించగా లోతైన విచారణ తర్వాత వారంతా చట్టబద్ధమైన అమెరికా పౌరులేనని తేలిందని గుర్తు చేశాయి. కాగా కొత్తగా పౌరసత్వం పొందిన వారు ఇంకా పాస్‌పోర్ట్, ఇతర డేటాను అప్‌డేట్ చేసుకోకపోవడంతో వారిని పొరబాటుగా 'పౌరులు కానివారు'గా చూపిస్తున్నారని నిపుణులు తెలిపారు. తన ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. ప్రభుత్వం సేకరించిన డేటాలో అనేక లోపాలు ఉన్నాయని, ఎన్నికలు ముగిసే వరకూ ఎలాంటి దర్యాప్తులు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది.
క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బెదిరింపు
అమెరికాలో పెద్ద ఎత్తున ఓట్ల మోసం జరుగుతోందంటూ ట్రంప్ చాలా కాలంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాటికి మద్దతుగా పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ ధిల్లాన్ సంతకంతో కూడిన లేఖలను అమెరికాలోని మొత్తం యాభై రాష్ట్రాలకూ పంపారు. ఓటర్ల జాబితాలో పౌరసత్వం లేని వారి పేర్లను ఉంచినా లేదా వారు ఓటు వేసేందుకు సహకరించినా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అసలు పౌరసత్వం లేని వారి పేర్లను ప్రభుత్వం ఓటర్ల జాబితాలో ఎలా చేర్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓట్ల తొలగింపునకు సంబంధించిన డిమాండ్లను రాష్ట్రాల ముందుకు తీసుకురావడం సరికాదని ఎన్నికల అధికారులు, నిపుణులు అభిప్రాయపడ్డారు.
కుంటిసాకులు వెదుకుతున్న ప్రభుత్వం
ట్రంప్ ప్రభుత్వ బెదిరింపుల కారణంగా... చట్ట బద్ధంగా ఓటు హక్కు పొందిన వలసదారులు తాము ఓటు వేస్తే ఎక్కడ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటా మేమోనన్న భయంతో ఓటు వేయడానికి రాక పోవచ్చునని ఓటింగ్ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమ యంలో ఇలాంటి లేఖలు రాయడం వెనుక ట్రంప్ ప్రభుత్వానికి ఓ స్పష్టమైన వ్యూహం ఉన్నదని అర్థమవుతోంది. ఒకవేళ రిపబ్లికన్లు పరాజయం పాలైతే అక్రమ ఓటింగ్ కారణంగానే ఓడిపోయామని చెప్పుకోవడానికి ఈ కుంటి సాకులు ఉపయోగ పడతాయి. ఏదేమైనా సాధారణ పౌరులను ఓటు వేయకుండా భయ పెట్టడానికి, ఫెడరల్ వ్యవస్థ పరిధిని దాటి రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి ట్రంప్ ప్రభు త్వం చేస్తున్న రాజకీయ ప్రయత్నంగా ఈ ఉదంతాన్ని విమర్శకులు విశ్లేషించారు.







కామెంట్‌లు (0)