నిజమైన హంతకులను అరెస్టు చేసే వరకు విశ్రమించేది లేదు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-బోనకల్/చింతకాని
సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు, పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకే ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కట్టుకథలు అల్లి నిందితులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల పాతర్లపాడులో సామినేని రామారావు ప్రథమ వర్ధంతిని సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం సామినేని రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లా డారు.
సామినేని రామారావు హత్య జరిగి ఏడాది అవుతోం దని, ఈనెల 31వ తేదీన సామినేని రామారావు ప్రథమ వర్ధంతి నిర్వహించనున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కొన్ని కట్టు కథలు అల్లి ఖమ్మం రూరల్ మండలం తెల్దారిపల్లి గ్రామానికి చెందిన కొంత మందిని అరెస్టు చేసి వీరే సామినేనిన హంతకులని విలేక రుల సమావేశంలో వెల్లడించడాన్ని తీవ్రంగా ఖండించారు. సామినేని రామారావు హత్య కేసులో నిజమైన నిందితులను అరెస్టు చేయకుండా, డిప్యూటీ సీఎంను కాపాడేందుకే పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని విమర్శించారు. గురువారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నిర్వహించిన ప్రెస్మీట్ ఇందుకు ఉదాహరణగా అని అన్నారు. హత్యకు కారణాలను వెల్లడించకుండా, అరెస్టయిన నిందితులు రామారావును ఎందుకు హత్య చేశారనే వివరాలు చెప్ప కుండా పోలీస్ కమిషనర్ ప్రెస్మీట్ ముగించారని తెలిపా రు. అసలు నిందితులను కాపాడేందుకు ఎలాంటి ఆధా రాలను వెల్లడించకుండా కట్టుకథలతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరికీ ఎలాంటి హామీ తలపెట్టని సామినేని రామారావుని పాతర్లపాడు కాంగ్రెస్ నాయకులు హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా గతంలో తెల్దారిపల్లి గ్రామాన్ని ఆశ్రయించేవారని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నం తకాలం ఈ కేసులో నిజమైన నిందితులను పోలీసులు అరెస్టు చేయలేరని అన్నారు. అసలు నిందితులను అరెస్టు చేసే వరకు సీపీఐ(ఎం) పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని తమ్మినేని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు గెలుస్తోందో ఇప్పుడు అర్థమవుతోందని, బీజేపీకి ఓట్లు వేయని వారి ఓట్లను తొలగిస్తూ ఎన్నికల్లో గెలుస్తోం దని విమర్శించారు. తనకు ఎదురులేదని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్ల పురాణానికి దిగారని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడంలో ముఖ్యమంత్రి దిట్ట అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దేశబోయిన ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)