నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకు అంతర్గత విభేదాలు ఎక్కువతున్నాయి. మొన్నంటి వరకు సీఎం కుర్చీపై పేచీ రాజకీయ అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం కానున్నారు. అయితే, ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అందుబాటులో లేన్నట్లు తెలుస్తోంది.
అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నట్లు ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధుల కేటాయింపునకు సంబంధించి ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య విధానసౌధలో సమావేశం కానున్నారు. దీనికి డీకే దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇది తమను ఎంతో ఆందోళనకు గురిచేస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా.. శివకుమార్ ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉండటం ఇదేం కొత్త కాదని అధికారిక వర్గాలు తెలిపాయి. గత పదవీకాలంలో కూడా పలు భేటీలకు ఆయన హాజరుకాలేదని వెల్లడించాయి.
ఇక, డీకే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన సమావేశానికి హాజరుకాలేకపోతున్నారని మరికొందరు తెలిపారు. అయితే, ఈసారి విధానసౌధలో సీఎం ఛాంబర్‌లో ఈ భేటీ జరగనుండటం చర్చనీయాంశమైంది. డీకేను దూరం పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా నిర్వహించాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. వీటన్నింటిపై మౌనంగా ఉన్న శివకుమార్ తన కార్యకలాపాల్లో మునిగిపోయారు.