నవతెలంగాణ – హైదరాబాద్: ధర్మస్థలలో సామూహిక లైంగికదాడులు, హత్యలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేసిన ఫిర్యాదుదారుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకూ ఈ కేసులో బాధితుల పక్షాన మాట్లాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడి ఆరోపణలన్నీ కల్పితమని, అవాస్తవమని తేలడంతో ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా, తన ముఖం బయటపడకుండా ముసుగు ధరించి ఒక వ్యక్తి ధర్మస్థలలో ఘోరాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అతడిని విచారణకు పిలిచింది. గంటల తరబడి సాగిన విచారణలో అతడు చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పాటు, చెప్పినవన్నీ కట్టుకథలని విచారణలో తేలింది. దీంతో, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారన్న కారణంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ అరెస్ట్‌తో ధర్మస్థల కేసు అనూహ్య మలుపు తీసుకుంది.