డాక్టర్ భైరవ నాథ్ ముత్యపు
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఆపరేషన్ మొదలులో మత్తు ఇచ్చి, ఆపరేషన్ పూర్తయ్యాక రోగి మత్తు నుంచి సురక్షితంగా బయటకు వచ్చేవరకు పర్యవేక్షించడంలో మత్తు డాక్టర్ కీలకపాత్ర పోషిస్తారని ఎంబీబీఎస్, డి ఎ (ఎఫ్ ఐ పి ఎం) అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ భైరవ నాథ్ ముత్యపు తెలిపారు .
మొన్న అసాధ్యం, నిన్న కల,నేడు ఆవిష్కరణ, వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు. దేవుడు ప్రాణం పోస్తే, ఆ ప్రాణానికి ముప్పు వస్తే కాపాడేది వైద్యుడే. తీవ్రతను బట్టి మందులు, శస్త్రచికిత్సలతో పునర్జన్మను ఇస్తున్నారు. మానవ శరీరంలో అవయవాలు పాడైతే కృత్రిమమైనవి అమర్చి ప్రాణాలు నిలుపుతున్నారు. వైద్యుల్లో గుండెలు తీసిన బంట్లు ఉన్నారు. రికార్డు స్థాయిలో ఆపరేషన్లు చేసి చరిత్రకెక్కిన వారు ఉన్నారు. ఇలా ఎంతో మంది వైద్యులు ఉన్నా శస్త్రచికిత్సలో మత్తు మందు డాక్టర్ల పాత్ర ఎంతో కీలకం. రోగికి నొప్పి, బాధ తెలియకుండా గమ్మత్తుగా ఆపరేషన్లు చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతమే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ప్రాముఖ్యత.. అనస్థీషియా అంటే కేవలం నొప్పి తెలియకుండా చేయడం మాత్రమే కాదు. ఆధునిక వైద్యంలో అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రాణాపాయ పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వైద్యుల పాత్ర.. శస్త్రచికిత్స విజయవంతం కావడంలో అనస్థీషియా వైద్యులు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు రోగికి నొప్పి తెలియకుండా చూసుకోవడమే కాకుండా, ఆపరేషన్ సమయంలో రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, అన్ని పరిస్థితులలోనూ సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు.