నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మూడు మండలాలకు చెందిన అంగన్ వాడి టీచర్లకు పోషణ్ భి-పడాయి భి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, ఐకేపీ ఏపిఎం కిరణ్ కుమార్ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఏసిడిపివో జ్ఞానేశ్వరి శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కార్యక్రమంలో ఆయా మండలాల ఐసిడిఎస్ పర్యవేక్షకులు పోషణ్ భి-పడాయి భి కార్యక్రమంపై అంగన్ వాడి టీచర్లకు శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి ఏసిడిపివో జ్ఞానేశ్వరి మాట్లాడుతూ.. ఈ శిక్షణ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు.0-6 సంవత్సరాల పిల్లల మానసిక, శారీరక సాంఘికాభివృద్ధి, మేధో శక్తి, చురుకుదనం లాంటి ఎన్నో విషయాలను ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడి టీచర్లకు తెలియజేశామన్నారు. ఈ శిక్షణ వల్ల అంగన్ వాడి కేంద్రాలకు విచ్చేసే చిన్నారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
పలు అంశాలపై అంగన్వాడి టీచర్లకు ప్రొజెక్టర్ ద్వారా వివరిస్తూ అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ కమ్మర్ పల్లి మండల పర్యవేక్షకురాలు గంగ హంస, మోర్తాడ్ మండల పర్యవేక్షకురాలు మంజుల, ఏర్గట్ల మండల పర్యవేక్షకురాలు సరస్వతి, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున, మండల అధ్యక్షురాలు మంజుల, మూడు మండలాల అంగన్ వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.