Saturday, July 19, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మ‌రో దారుణం..ప్రియుడితో కలిసి భర్త హత్య

మ‌రో దారుణం..ప్రియుడితో కలిసి భర్త హత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పెళ్లికి ముందే ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నా మరొకరితో ఏడడుగులు వేసింది. తాళి కట్టిన భర్త ఇంటికే ప్రియుడిని తరచూ పిలిపించుకొనేది. వీరి బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి పథకం వేసి ప్రాణాలు తీసింది. ఏమీ తెలియనట్లుగా నటించింది. చివరకు పోలీసుల ఎదుట నిజం అంగీకరించింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సీ కాలనీలో (అరుంధతీయవాడ) బుధవారం రాత్రి జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. అరుంధతీయవాడకు చెందిన ఎల్‌.శీనయ్య (25)కు మండలంలోని పంగిలికి చెందిన ధనమ్మతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ధనమ్మకు పంగిలికి చెందిన కల్యాణ్‌తో పెళ్లి కాకముందు నుంచే సంబంధం ఉంది. తరచూ అతను ఇంటికొచ్చేవాడు. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలచి ప్రియుడితో కలిసి హత్య చేయాలని పథకం వేసింది. బుధవారం రాత్రి ఇంటికి కల్యాణ్‌ రాగా, అదే సమయంలో శీనయ్య మద్యం మత్తులో ఉండటంతో అంతమొందించాలనుకున్నారు. ఇద్దరూ కలసి మెడకు తీగ బిగించి వేలాడదీయడంతో శీనయ్య మృతి చెందాడు.

పొద్దెక్కినా శీనయ్య లేవకపోయేసరికి పక్కనే ఉంటున్న తల్లిదండ్రులు వచ్చి అడిగారు. ఏమీ తెలియనట్లుగా ధనమ్మ వారితో కలిసి లేపేందుకు వెళ్లింది. ఎంత పిలిచినా లేవకపోయేసరికి తల్లిదండ్రులు బంధువులను పిలిచారు. వారు వచ్చి చూసి సాధారణ మరణంగా భావించి, అంత్యక్రియలకు ఏర్పాట్లుచేశారు. కాసేపటికి శీనయ్య ఒంటిపై గాయాలను చూసి అనుమానించారు. బంధువులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని ధనమ్మ బుకాయించింది. పోలీసులు వచ్చి విచారించడంతో హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమెతో పాటు ప్రియుడు కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ వివరించారు. మృతుడికి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -