నవతెలంగాణ-హైదరాబాద్: కల్నల్ సోఫియా ఖురేషీని కించపరిచేలా ‘ఉగ్రవాదుల సోదరి’ అంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలను మరువక ముందే సాయుధ దళాలపై మరో బీజేపీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ”ప్రధాని మోడీకి సైన్యం తలవంచింది” అని మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా అవనమానకర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జబల్‌పూర్‌లో జరిగిన పౌర రక్షణ వాలంటర్లీ కార్యక్రమంలో దేవ్డా మాట్లాడుతూ.. ఈ రోజు దేశం మొత్తం, ఆర్మీ, దానిలోని సైనికులు ప్రధాని మోడీ పాదాలకు తలవంచి నమస్కరిస్తున్నారు. పాకిస్తాన్‌కు ఆయన ఇచ్చిన సమాధానానికి మోడీని ఎంత ప్రశంసించినా తక్కువే అంటూ దేవ్డా పేర్కొన్నారు.
మోహన్ యాదవ్ ప్రభుత్వ మంత్రి విజయ్ షా ధీరురాలైన సైన్యాధికారిని ‘ఉగ్రవాదుల సోదరి’ అని పిలుస్తారు, ఇప్పుడు ‘సైన్యం మోడీ పాదాలకు నమస్కరిస్తుంది’ అని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు జితూ పట్వారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై మీడియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించినపుడు.. ఆయన చిరాకుపడి అర్థంలేని సమాధానాలు ఇస్తారని మండిపడ్డారు. ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా బిజెపి వారికి రక్షణ కల్పిస్తోందని, బిజెపి అగ్రనాయకత్వం సైన్యాన్ని అవమానించే ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తమ పార్టీ ఆందోళన చేపడుతుందని అన్నారు.
ఇటువంటి దూషణమైన, సిగ్గులేని మాటలు ఏ భారతీయుడైనా మాట్లాడతారని మీరు ఊహించగలరా అని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే ప్రశ్నించారు. శత్రువులకు గుణపాఠం నేర్పిన సాయుధ దళాలకు దేశం మొత్తం కృతజ్ఞతలు తెలుపుతోంది. 1965, 1971, 1999 మరియు పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా సైన్యం తగిన సమాధానం ఇచ్చిందని అన్నారు. ఇటువంటి ప్రకటన దేశ సైన్యం పట్ల ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించడం, వారికిచ్చే గౌరవాన్ని కించపరచడమేనని అన్నారు. వారి శౌర్యాన్ని, త్యాగాలను ప్రజలు ఎప్పటికీ గౌరవిస్తారని అన్నారు. మన సరిహద్దులను కాపాడటమే కాకుండా దేశ ప్రాదేశిక సమగ్రతను రక్షిస్తున్నారని, వారికి తలలువంచాలని అన్నారు. సియాచిన్ హిమానీ నదాల నుండి రాజస్తాన్ ఎడారుల వరకు ప్రజలు సురక్షితంగా జీవించేలా నిరంతరం రక్షణ కల్పిస్తున్నాని అన్నారు. ఇటువంటి ప్రకటనను ఏ భారతీయుడు కూడా అంగీకరించడని, ఇది ఘోరమైన అవమానమని ఆమె మండిపడ్డారు.