Wednesday, March 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅభిషేక్‌ సింఘ్వీకి మరో ఛాన్స్‌..

అభిషేక్‌ సింఘ్వీకి మరో ఛాన్స్‌..

- Advertisement -

– అధిష్టాన కోటాలో అవకాశం
మరో సీటు రాష్ట్రానికి
– రాజ్యసభ స్థానాలపై కాంగ్రెస్‌ నిర్ణయం
– నేడు సీఎంతో భేటీకానున్న సింఘ్వీ
– పదహారు మందితో హైకమాండ్‌కు సీఎం, పీసీసీ చీఫ్‌ నివేదిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి సీడబ్ల్యూసీ సభ్యుడు అభిషేక్‌ సింఘ్వీతో భర్తీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు సమాచారం అందింది. సింఘ్వీ ఇప్పటికే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి విదితమే. కాగా ఆయనకు మరోసారి ఛాన్స్‌ ఇవ్వాలని హైకమాండ్‌ నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సింఘ్వీ… బుధవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక దానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే.కేశవరావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరోదానికి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, అధికార పార్టీలో చేరిన కేశవరావు, ఆ సందర్భంగా గులాబీ పార్టీ నుంచి లభించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సింఘ్వీకి అవకాశం కల్పిస్తూ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సాధించిన కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ కాలపరిమితి ముగియటంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. దీంతో సింఘ్వీకి మరోసారి అవకాశమివ్వాలని రాహుల్‌ గాంధీ నిర్ణయించి, ఆ మేరకు సీఎంకు, పీసీసీ చీఫ్‌కు సమాచారమిచ్చారు. మరో స్థానానికి రాష్ట్రం నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే విషయాన్ని వారిద్దరి ఇష్టానికే వదిలేశారు. దీంతో ఆశావహులు సీఎంను, పీసీసీ అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆ ఎంపిక అనంతరం సింఘ్వీతోపాటు మరో అభ్యర్థి బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేస్తారని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపాయి.

రేసులో 16 మంది…
వాస్తవానికి సింఘ్వీ స్థానాన్ని మినహాయిస్తే మరో రాజ్యసభ సీటుకు అభ్యర్థి ఎంపిక అధికార పార్టీకి కత్తిమీద సాములాగా మారింది. ఆ సీటును దక్కించుకునేందుకు దాదాపు 16 మంది పోటీ పడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలించి ఆ 16 మందితో కూడిన జాబితాను అధిష్టానానికి పంపామని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బీసీ సామాజిక వర్గం నుంచి సీనియర్‌ నాయకులు వీహెచ్‌, మధుయాష్కీ గౌడ్‌, ఇరవత్రి అనిల్‌, వినరు కుమార్‌ గౌడ్‌, నేరెళ్ల శారద రేసులో ఉన్నట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుండి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ పోటీ పడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రోహిన్‌ రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్‌ రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, కోదండ రెడ్డి రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఇక ఎస్టీల నుంచి బెల్లయ్య నాయక్‌, మైనార్టీ నుండి అజ్మతుల్లా హుస్సేన్‌, షబ్బీర్‌ అలీ రేసులో ఉన్నట్టు సమాచారం. అయితే ఉన్న ఒక్క సీటులో సీఎం ఎవరిని కూర్చోబెడతారో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -