నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ కమలం పార్టీలో మరోసారి ముసలం మొదలైంది. మొదట్లో కిషన్-బండి సంజయ్ ల మధ్య వార్ నడవగా ఆ పార్టీల పెద్ధల జోక్యంతో సద్దుమణిగింది. ఆ తర్వాత ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కాస్తా చేతుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. పార్టీలోని ఇద్దరు అగ్రనేతలు సై అంటే సై అని బహిరంగానే సవాల్ విసురుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నికలప్పుడు పెద్ద రగడ నడిచింది. రాంచందర్ రావు ఎన్నికను నిరసిస్తూ..బీజేపీ అధిష్టానంపై రాజాసింగ్ దుమ్మెత్తి పోశారు. తాను బీజేపీలో కొనసాగేంది లేదని ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా మరోసారి కమలం పార్టీ తీరు, నిర్ణయాలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు.
పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్‌బాల్ ఇచ్చి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారాలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ తివారీని కలిస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలవమని చెబుతున్నారని, ఆయనను కలిస్తే అభయ్ పాటిల్‌ను కలవమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిని సంప్రదిస్తే మరొకరి పేరు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.