నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హరీష్ రావు పాత్రపై ఓ ప్రయివేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు విచారణపై దర్యాప్తు సంస్థను ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేస్తూ.. ఇంకెంత కాలం ఇంటరాగేషన్ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలుంది? అంటూ స్పష్టమైన ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించిన కోర్టు.. దర్యాప్తునకు సహకరిస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.


